టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.
ఆది నుంచి దారుణంగా విఫలం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ
అనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.
దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
A well-constructed half-century for #AbhishekSharma! 👏
His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙
ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026
అర్ధ శతకంతో
జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్‌లో తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్‌లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్


