సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌! | T20 WC: South Africa Beat West Indies By 9 Wickets Big Boost For India | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

Feb 26 2026 6:19 PM | Updated on Feb 26 2026 7:01 PM

T20 WC: South Africa Beat West Indies By 9 Wickets Big Boost For India

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా మరో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను 76 పరుగులతో చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేశారు. తద్వారా సెమీ ఫైనల్‌ రేసులో ప్రొటిస్‌ జట్టు ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు టీమిండియా సెమీస్‌ ఆశలను కూడా సజీవం చేసింది.

పోటీలో నాలుగు
సూపర్‌-8 దశలో గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్‌, జింబాబ్వే బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా- టీమిండియా తలపడగా.. మార్క్రమ్‌ బృందం సూర్యకుమార్‌ సేనను చిత్తుగా ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మరోవైపు.. వెస్టిండీస్‌ తమ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సౌతాఫ్రికా విండీస్‌ను ఓడిస్తేనే టీమిండియా సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి.

టీమిండియాకు సానుకూలాంశం
ఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేయడం.. టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

నిప్పులు చెరిగిన బౌలర్లు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. విండీస్‌ బ్యాటర్లలో జేసన్‌ హోల్డర్‌ (49), రొమారియో షెఫర్డ్‌ (52 నాటౌట్‌) రాణించారు. ప్రొటిస్‌ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, కార్బిన్‌ బాష్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

మార్క్రమ్‌ ధనాధన్‌
ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్‌ డికాక్‌ (24 బంతుల్లో 47) ఫర్వాలేదనిపించగా.. ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌  ఇన్నింగ్స్‌ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్‌.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మార్క్రమ్‌కు తోడుగా ర్యాన్‌ రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌) రాణించాడు. వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే సూపర్‌-8లో రెండు గెలిచిన సౌతాఫ్రికా తదుపరి జింబాబ్వేపై కూడా గెలవాలి.

అదే విధంగా టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లపై తప్పక విజయం సాధించాలి. అలా అయితేనే నెట్‌రన్‌రేటు లెక్కలతో పనిలేకుండా టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా స్కోర్లు
వెస్టిండీస్‌: 176/8(20)
సౌతాఫ్రికా: 177/1(16.1)
ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
 
చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement