జింబాబ్వేతో కీలక సూపర్-8 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించాలి.
లెఫ్ట్-రైట్ కాంబినేషన్
ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్‌లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.
ఆ ముగ్గురిపై వేటు!
అయితే, ఓపెనింగ్ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మను కొనసాగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్ తిలక్ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్‌డౌన్‌లో కుడిచేతి వాటం బ్యాటర్ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్‌కు అనుకూలమైన చెపాక్ పిచ్‌పై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో స్థానిక ఆల్‌రౌండర్, చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్.. రింకూ స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
సఫారీల చేతిలో భారీ ఓటమితో
కాగా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్


