స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని ఫ్యాన్స్‌ను ఉసూరుమనిపించింది.
వాస్తవానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టుపై ఓ మోస్తరు అంచనాలు ఉండేవి. హోం అడ్వాంటేజ్ కలిసొచ్చి ప్రత్యర్దులను ఇబ్బంది పెడుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. గ్రూప్ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చినా.. సూపర్-8కు రాగానే తేలిపోయింది. వరుసగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆసీస్‌పై గెలుపు మినహా శ్రీలంక గ్రూప్ దశలోనూ పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తమకంటే చాలా బలహీనమైన జింబాబ్వే చేతిలో ఓటమిపాలై, సొంత అభిమానులచే చీవాట్లు తినింది. సూపర్-8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను బౌలింగ్‌లో కట్టడి చేయగలిగినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఓ మోస్తరు స్కోర్లను ఛేదించలేక చతికిలబడింది.
తొలుత ఇంగ్లండ్, తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. ఇంగ్లండ్‌ను 146 పరుగులకు కట్టడి చేసి సంకలు గుద్దుకున్నా, ఆతర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసి 95 పరుగులకే కుప్పకూలింది.
న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తా చాటి ప్రత్యర్దిని 168 పరుగులకే కట్టడి చేసినా.. ఇంగ్లండ్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఉసూరుమనిపించారు. కనీసం టార్గెట్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేక 107 పరుగులకే పరిమితమయ్యారు.
గ్రూప్ దశలో పసికూనలు ఐర్లాండ్, ఒమన్ మినహా ఈ మెగా టోర్నీలో శ్రీలంక సాధించింది ఏమీ లేదు. ఆసీస్‌పై దక్కిన విజయాన్ని లంక క్రెడిట్‌కు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జట్టు స్టార్లు లేక బలహీనంగా ఉండింది.
మొత్తంగా హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన శ్రీలంక సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి గత కొంతకాలంగా ఏమంత ఆశాజనకంగా లేదు. గత పదేళ్లకాలంలో ఆ జట్టు అడపాదడపా విజయాలు మినహాయించి ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కనీసం సెమీఫైనల్స్‌కు చేరుకోలేదు.
ఆ జట్టు చివరిగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్స్‌లో భారత్ చేతిలో చిత్తై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆతర్వాత వరుసగా జరిగిన 10 ఐసీసీ మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా సెమీస్‌కు చేరుకోలేదు. 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2022 టీ20 వరల్డ్‌కప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2026లో శ్రీలంక సెమీస్‌కు ముందే నిష్క్రమించింది.
ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. కొన్నేళ కిందటి వెస్టిండీస్ దుస్థితి గుర్తుకు వస్తుంది. విండీస్ జట్టు స్టార్లంతా రిటైరయ్యాక ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఆ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. శ్రీలంకను చూస్తే.. విండీస్‌కు పట్టిన గతే పట్టేలా ఉందనిపిస్తుంది.
లంక జట్టులో టాలెంట్‌కు కొదవ లేకున్నా, నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. నిస్సంక లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నా, మిగతా వారి నుంచి వారికి మద్దతు లభించడం లేదు.
హసరంగ, పతిరణ లాంటి స్టార్ బౌలర్లు తరుచూ గాయాల బారిన పడి కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. బౌలింగ్‌లో తీక్షణ, వెల్లాలగే పర్వాలేదనిపించినా, ఆ స్థాయి రాణింపు మ్యాచ్‌లకు గెలిపించదు.
కుసాల్ మెండిస్, అసలంక, కమిందు మెండిస్, కెప్టెన్ షనక లాంటి వారు క్రమం తప్పకుండా రాణిస్తేనే శ్రీలంక ఫేట్ మారుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులోనే ఆ జట్టు పసికూన చేతిలో కూడా పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


