టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్‌కోంచి (31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
ఈ క్రమంలో సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్ హస్సీ-స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై ఈ జోడీ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.
డెత్ ఓవర్లలో దూకుడు
డెత్ ఓవర్లలో సాంట్నర్-మెక్‌కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్‌లో 18, 18వ ఓవర్‌లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.
అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్
ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు
169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ నిస్సంకను క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్‌లో అసలంకను పెవిలియన్‌కు పంపాడు.
ఆతర్వాత స్పిన్నర్లు లైన్‌లోకి వచ్చి లంక ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్ (4-0-19-1), గ్లెన్ ఫిలిప్స్ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు.
ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్ స్కోరర్.


