దూసుకొచ్చిన ఇషాన్‌ కిషన్‌ | ICC T20I Rankings: Ishan Kishan Jumps To Fifth Among Batters, Shivam Dube Rises To Seventh | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన ఇషాన్‌ కిషన్‌

Feb 26 2026 9:05 AM | Updated on Feb 26 2026 9:56 AM

ICC T20I Rankings: Ishan Kishan Jumps To Fifth Among Batters, Shivam Dube Rises To Seventh

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ ప్లేస్‌ దిశగా దూసుకొచ్చాడు. గత వారం ఎనిమిదో స్థానంలో ఉండిన అతను.. తాజాగా ఐదో స్థానానికి ఎగబాకాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా భారత విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అగ్రస్థానాన్ని నెలబెట్టుకున్నాడు. 

అయితే రెండో ప్లేస్‌లో ఉన్న ఫిల్‌ సాల్ట్‌కు అతనికి మధ్య పాయింట్ల వత్యాసం బాగా తగ్గింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాక్‌ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ తన కెరీర్‌లో మొదటిసారి టాప్‌-3లోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో వరుసగా సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన ఫర్హాన్‌.. 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరాడు. 

తాజాగా సెంచరీ చేసినా లంక ఆటగాడు నిస్సంక ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయినా సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్న తిలక​ వర్మ 3 స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రిక చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెవిస్‌ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 9వ స్థానానికి చేరాడు.

మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు ఇవే..
హ్యారీ బ్రూక్‌- 18వ ర్యాంక్‌ (10 స్థానాలు ఎగబాకి)
శివమ్‌ దూబే- 28వ ర్యాంక్‌ (13 స్థానాలు ఎగబాకి)
షిమ్రోన్‌ హెట్‌మైర్‌- 46 (10 స్థానాలు ఎగబాకి)
షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌- 50 (8 స్థానాలు ఎగబాకి)
డేవడ్‌ మిల్లర్‌- 69 (10 స్థానాలు ఎగబాకి)
విల్‌ జాక్స్‌- 71 (21 స్థానాలు ఎగబాకి)

శ'బాష్‌'
ఈ వారం టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్‌ కార్బిన్‌ బాష్‌ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరాడు. భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టాప్‌ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. వెస్టిండీస్‌ బౌలర్‌ మాథ్యూ ఫోర్డ్‌ కూడా ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. ఇతను ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా కూడా ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఓ మోస్తరుగా లబ్ది పొందాడు. 7 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3, అక్షర్‌ పటేల్‌ 10 స్థానాలు కోల్పోయి 20, 24 స్థానాలకు పడిపోయారు.

భారీగా లబ్బి పొందిన బౌలర్లు..
మార్కో జన్సెన్‌- 19వ ర్యాంక్‌ (8 స్థానాలు ఎగబాకి)
గుడకేశ్‌ మోటీ- 22 (17 స్థానాలు ఎగబాకి)
లియామ్‌ డాసన్‌- 23 (23 స్థానాలు ఎగబాకి)
ఫమార్‌ జోసఫ్‌- 54 (14 స్థానాలు ఎగబాకి)
ఉస్మాన్‌ తారిక్‌- 55 (59 స్థానాలు ఎగబాకి)
షాదాబ్‌ ఖాన్‌- 65 (10 స్థానాలు ఎగబాకి)
మొహమ్మద్‌ నబీ- 78 (37 స్థానాలు ఎగబాకి)

తిరిగి నంబర్‌ వన్‌గా 
ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే.. జింబాబ్వే ఆటగడు సికందర్‌ రజా తిరిగి తన నంబర్‌ వన్‌ పీఠాన్ని అధిరోహించాడు. పాక్‌ ఆటగాడు సైమ్‌ అయూబ్‌ను కిందకు దించి ఈ ఘనత సాధించాడు. భారత ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శివమ్‌ దూబే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి చేరాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement