టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఎలో తొలుత అమెరికా.. తర్వాత నమీబియాలను ఓడించిన భారత్.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తు చేసింది. దాయాదిపై ఏకంగా 61 పరుగుల తేడాతో నెగ్గి సూపర్-8 దశకు అర్హత సాధించింది.
తటస్థ వేదికైన కొలంబోలో ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్య సేన ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. టాస్ ఓడి తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌ను 114 పరుగులకే ఆలౌట్ చేసింది.
మొదలుపెట్టి.. తానే ముగించాడు
భారత బ్యాటర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అదరగొట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో వికెట్ల వేట మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)నే.. చివరి వికెట్ కూల్చి విజయంతో ముగించాడు.
పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (0)ను వచ్చీరాగానే వెనక్కి పంపిన హార్దిక్.. ఆఖరిగా ఉస్మాన్ తారిఖ్ (0)ను పెవిలియన్‌కు పంపి టీమిండియాను గెలుపును ఖరారు చేశాడు.
క్యాచ్‌లు డ్రాప్ చేసిన ఇషాన్, కుల్దీప్
ఈ క్రమంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పదిహేడో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌కు దిగగా.. తొలి బంతి వైడ్ అయింది. అనంతరం షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ డ్రాప్ చేశాడు.
దీంతో లైఫ్ పొందిన ఆఫ్రిది.. హార్దిక్ బౌలింగ్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నిజానికి లాంగాన్ వద్ద ఫీల్డింగ్ పొజిషన్‌లో ఉన్న కుల్దీప్ దానిని జారవిడిచాడు. చేతుల్లో పడిన బంతిని డ్రాప్ చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Hardik pandya didn’t spare Kuldeep yadav after that dropped the catch ! The frustration on Kuldeep yadav face says it all. pic.twitter.com/4qazJi9M1d
— Indian First (@MaheshJain68174) February 16, 2026
మీకసలు బుద్ధి ఉందా?
ఇషాన్‌తో పాటు కుల్దీప్ వైపు చూపిస్తూ.. ‘ఏం జరిగినా మీ ఇద్దరే కారణం.. మీకసలు బుద్ధి ఉందా?’ అన్నట్లుగా ఫైర్ అయ్యాడు. ఇక ఆ ఓవర్లో ఐదో బంతికి ఆఫ్రిది ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి పాండ్యా తారిఖ్‌ను బౌల్డ్ చేయడంతో పాక్ కథ ముగిసిపోయింది. టీమిండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ये गलत है ! Feeling bad for Kuldeep Yadav 😭#IshanKishan #INDvsPAK pic.twitter.com/Z7BfPy85Fc
— Amrita Yadav (@AmritaYada60221) February 15, 2026
సూర్య సైతం
ఇక విజయానంతరం కరచాలనం చేసుకునే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం కుల్దీప్ యాదవ్‌ను గట్టిగానే మందలించాడు. ఈ చైనామన్ స్పిన్నర్ సులువైన క్యాచ్‌ను వదిలేశాడన్న కోపంతో సూర్య.. అతడిని చులకన చేసి మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.


