ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 61 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ (0) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ ఔటయ్యాక తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ చివరిలో శివం దూబే (27)., రింకూ సింగ్(4 బంతుల్లో 11) మెరుపులు మెరిపించారు. ఫలితంగా 170 పైగా భారత్ స్కోర్ సాధించగల్గింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగట్టగా.. సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తలా వికెట్ సాధించారు.
అదరగొట్టిన భారత బౌలర్లు
అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమిండియా బౌలర్ల ధాటికి దాయాది జట్టు 18 ఓవర్లలో కేవలం ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం.


