చ‌రిత్ర సృష‍్టించిన ఇషాన్ కిషన్‌.. యువరాజ్ రికార్డు బ్రేక్‌ | Ishan Kishan slams 27-ball fifty, breaks Yuvraj Singh's record vs Pakistan | Sakshi
Sakshi News home page

IND vs PAK: చ‌రిత్ర సృష‍్టించిన ఇషాన్ కిషన్‌.. యువరాజ్ రికార్డు బ్రేక్‌

Feb 15 2026 8:38 PM | Updated on Feb 15 2026 9:09 PM

Ishan Kishan slams 27-ball fifty, breaks Yuvraj Singh's record vs Pakistan

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికి.. ఇషాన్ మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో ఇషాన్ కేవ‌లం 27 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న కిష‌న్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 77 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన కిష‌న్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యంత‌వేగవంత‌మైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 27 బంతుల్లోనే ఆర్ధ శ‌త‌కం బాదిన ఇషాన్‌.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. కిష‌న్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌(32), తిల‌క్ వ‌ర్మ‌(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌల‌ర్ల‌లో సైమ్ అయూబ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స‌ల్మాన్ అఘా, ఉస్మాన్ త‌రీఖ్, అఫ్రిది త‌లా వికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement