టీమిండియా చేతిలో పాకిస్తాన్‌కు మరోసారి పరాభవమే ఎదురైంది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ గొప్పలకు పోయి.. ఆ తర్వాత దిగివచ్చిన దాయాదికి సూర్య సేన దిమ్మతిరిగేలా షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026లో పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది.
ప్రధాన కారణం వాళ్లే
ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మా స్పిన్నర్లపైనే నమ్మకం ఉంచాము. కానీ వారు రాణించలేకపోయారు. ప్రణాళికలను అమలు చేయడంలో మా వాళ్లు సఫలం కాలేదు. గత ఆర్నెళ్లుగా వారు విజయవంతమైన దళంగా కొనసాగుతున్నారు.
కానీ ఇప్పుడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. ఇక మా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది.
పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే టాస్ గెలిచిన తర్వాత నేను బౌలింగ్ ఎంచుకున్నాను. బంతిపై గ్రిప్పింగ్ కూడా బాగానే ఉంది. కానీ మా వాళ్లు తమ వ్యూహాల్ని అమలు చేయలేకపోయారు. పరిస్థితికి తగ్గట్లు మా వాళ్లు బౌలింగ్ చేయలేదు.
బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలం
మా బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఇలాంటి మ్యాచ్‌లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం సహజమే. అయితే, మేము ఇప్పటికే ఎంతో క్రికెట్ ఆడాము. మాకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. తదుపరి మ్యాచ్‌లో గెలిచి సూపర్ 8కు చేరాలని పట్టుదలగా ఉన్నాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. సమిష్టి వైఫల్యం కారణంగానే తాము పరాజయం పాలయ్యామని పొరపాట్లను అంగీకరించాడు.
వికెట్లు తీసినా..
కాగా కొలంబోలో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేయగా.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తీయగా.. సల్మాన్ ఆఘా ఒక వికెట్ తీశాడు, ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్, పేసర్ , షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే, పాక్ స్పిన్నర్లు వికెట్లు తీసినా కూడా పరుగులు కూడా ఎక్కువే ఇచ్చుకోవడం గమనా ర్హం.
పెవిలియన్‌కు క్యూ కట్టిన బ్యాటర్లు
ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ డకౌట్ కాగా.. సయీబ్ ఆయుబ్ 6.. వన్‌డౌన్ బ్యాటర్ సల్మాన్ ఆఘా 4, తర్వాతి స్థానాల్లో వచ్చిన బాబర్ ఆజం 5 పరుగులకే పెవిలియన్ చేరారు.
BIGGEST WIN FOR INDIA OVER PAKISTAN IN T20Is (61 runs)! 🤯
With that, they make it 8-1 in #INDvPAK in the ICC Men's T20 World Cup and qualify for the Super 8! 👏
Watch them next in ICC Men's #T20WorldCup | #INDvNED | WED, 18 FEB, 6 PM! pic.twitter.com/na6yc5i7Pz— Star Sports (@StarSportsIndia) February 15, 2026
వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (44) మెరుగ్గా రాణించగా.. షాహిన్ ఆఫ్రిది 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా తేలిపోయారు. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలా ఒక వికెట్ తీశారు. పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు కూల్చారు.


