T20 World Cup 2026: భారత్‌ ‘రుద్ర’ రూపం | T20 World Cup 2026: Ishan Kishan comes out of syllabus for Pakistan as India win by 61 Runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: భారత్‌ ‘రుద్ర’ రూపం

Feb 16 2026 5:28 AM | Updated on Feb 16 2026 5:28 AM

T20 World Cup 2026: Ishan Kishan comes out of syllabus for Pakistan as India win by 61 Runs

పాకిస్తాన్‌పై మరో విజయం 

61 పరుగులతో టీమిండియా గెలుపు

ఇషాన్‌ కిషన్‌ మెరుపు బ్యాటింగ్‌ 

‘సూపర్‌–8’కు భారత్‌ అర్హత

‘విక్రమార్కుడు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ శవాన్ని భుజాన వేసుకొని మళ్లీ నడక సాగించాడు... చందమామ కథలో బేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు సరైన సమాధానం ఇవ్వగానే బేతాళుడు మళ్లీ చెట్టెక్కటం... ‘బేతాళ పంచ విశతి’లో మళ్లీ మళ్లీ ఇదే దృశ్యం, ఇదే సంవాదం... భారత్, పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌ అంటే దీనికి సరిగ్గా సరిపోతుంది! 

ఐసీసీ టోర్నీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ తేదీ ప్రకటనతో హడావిడి మొదలు... ప్రత్యక్షంగా మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఏర్పాట్లు ఒక వైపు... ప్రసారకర్తల ప్రకటనలు మరోవైపు... వ్యాఖ్యాతలు, విశ్లేషకుల తీవ్ర చర్చ... మ్యాచ్‌ సమీపిస్తున్న కొద్దీ ఎన్నో కథలు, కథనాలు, వివాదాలు... ఈ మ్యాచ్‌ లేకపోతే క్రికెట్‌ లేదన్నట్లుగా ఏమార్పు... ఒక రకమైన యుద్ధ వాతావరణం... ఇరు జట్ల బలాబలాల మధ్య ఉన్న అంతరం గురించి అందరికీ తెలుసు... ఫలితం ఎలా రావచ్చో కూడా అంచనాకు రావచ్చు... అయినా సరే మ్యాచ్‌ గురించి హంగామా... చివరకు ఎప్పటిలాగే భారత్‌దే విజయం.

పిచ్‌ బ్యాటింగ్‌కు తగినంత అనుకూలంగా లేదు... బంతి ఆగుతూ నెమ్మదిగా వస్తోంది. భారత్‌ ఇన్నింగ్స్‌ రెండో అర్ధభాగంలో ఇది కనిపించింది కూడా. కానీ ఆరంభంలో ఇషాన్‌ కిషన్‌ చూపించిన దూకుడు పిచ్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మిగతా జట్టంతా కలిసి ఎక్స్‌ట్రాలు సహా 80 బంతుల్లో 98 పరుగులు రాబడితే... ఇషాన్‌ ఒక్కడే మిగిలిన 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్‌లో అసలు తేడా ఏంటో చూపించాడు. 

టి20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసిన తర్వాత ప్రత్యరి్థని నిలువరించడం భారత్‌కు ఏమాత్రం కష్టం కాలేదు. ఆరుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ అయినా పడగొట్టగా, సమష్టి ప్రదర్శనతో పాక్‌ను టీమిండియా కుప్పకూలి్చంది. ఐదు ఓవర్ల లోపే టాప్‌–4 వికెట్లు కోల్పోయిన పాక్‌ కోలుకోలేకపోయింది. అసలు పాకిస్తాన్‌ తమకు ఏమాత్రం పోటీ కాదన్నట్లుగా నిరూపిస్తూ భారత్‌ ఏకపక్షంగా ఘన విజయం అందుకుంది.  

కొలంబో: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు 7–1తో పైచేయి ఉండగా ఇప్పుడు ఎనిమిదోసారి పాక్‌ను విశ్వవేదికపై మట్టికరిపించింది. భారత్‌ ముందు పాక్‌ ఏమాత్రం నిలవలేకపోవడంతో ఊహించిన ఫలితమే వచి్చంది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో పాకిస్తాను చిత్తు చేసింది. టి20ల్లో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 

టాస్‌ గెలిచి పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పాక్‌ బౌలర్లలో సయీమ్‌ అయూబ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్‌ ఖాన్‌ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు.

 వరుసగా మూడో విజయంతో భారత్‌ ‘సూపర్‌ ఎయిట్స్‌’కు అర్హత సాధించింది. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడుతుంది. ఆసియా కప్‌ తరహాలోనే తమ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ కెపె్టన్‌ సల్మాన్‌ ఆఘాకు భారత సారథి సూర్యకుమార్‌ ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వలేదు. భారత్‌ చేతిలో భారీ ఓటమితో పాకిస్తాన్‌ ‘సూపర్‌–8’ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తప్పనిసరిగా గెలిస్తేనే ‘సూపర్‌–8’ దశకు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్‌ ఓడిపోతే అమెరికా ‘సూపర్‌–8’కు చేరుతుంది.  

అభిశేక్‌ మళ్లీ డకౌట్‌... 
పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ సల్మాన్‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు బంతులు పరుగు తీయలేకపోయిన అభిశేక్‌ శర్మ (0) తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. టోర్నీలో అతనికి ఇది వరుసగా రెండో డకౌట్‌. అయితే ఇషాన్‌ చెలరేగిపోవడంతో జట్టు దూసుకుపోయింది. షాహీన్‌ అఫ్రిది ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అబ్రార్‌ ఓవర్లోనూ 6, 4 కొట్టాడు. పవర్‌ప్లేలో భారత్‌ 52 పరుగులు చేసింది. 

అనంతరం అబ్రార్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్‌ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన ఇషాన్‌ను ఎట్టకేలకు 9వ ఓవర్లో పాక్‌ అవుట్‌ చేయగలిగింది. ఆ సమయంలో భారత్‌ స్కోరు 88 అయితే ఇషాన్‌ ఒక్కడే 76 బాదడం విశేషం! మరోవైపు తిలక్‌ వర్మ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ కాస్త తడబడుతూనే సాగింది. 

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అతను ఒకే స్కోరు (25) చేశాడు. తిలక్, పాండ్యా (0)లను అయూబ్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. ఈ దశలో సూర్య, శివమ్‌ దూబే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా పిచ్‌ అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 38 పరుగులు జోడించేందుకు 34 బంతులు పట్టాయి. అఫ్రిది వేసిన చివరి ఓవర్లో దూబే, రింకూ సింగ్‌ (11 నాటౌట్‌) కలిసి 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాబట్టారు. భిన్నమైన యాక్షన్‌తో తీవ్ర చర్చను రేకెత్తించిన ఉస్మాన్‌ తారిఖ్‌ (1/24) 2 ఫోర్లు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు.  

ఉస్మాన్‌ ఖాన్‌ మినహా... 
తొలి ఓవర్‌ నాలుగో బంతికి ఫర్హాన్‌ (0) అవుట్‌ కావడంతో మొదలైన పాక్‌ పతనం వేగంగా సాగింది. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో అయూబ్‌ (6), సల్మాన్‌ (4) వెనుదిరగ్గా, అక్షర్‌ తన తొలి ఓవర్లోనే బాబర్‌ ఆజమ్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 38/4కు చేరింది. ఉస్మాన్‌ ఒక్కడే కాస్త పోరాడుతూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.

 అయితే 57 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉస్మాన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో షాహిన్‌ అఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు సాధించినా లాభం లేకపోయింది. గత మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో భారత్‌ రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిశేక్‌...సామ్సన్‌ స్థానంలో రాగా, అర్‌‡్షదీప్‌కు బదులుగా అదనపు స్పిన్నర్‌ కుల్దీప్‌ను మేనేజ్‌మెంట్‌ ఎంచుకుంది.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (బి) అయూబ్‌ 77; అభిశేక్‌ (సి) అఫ్రిది (బి) సల్మాన్‌ 0; తిలక్‌ (ఎల్బీ) (బి) అయూబ్‌ 25; సూర్యకుమార్‌ (సి) అయూబ్‌ (బి) తారిఖ్‌ 32; పాండ్యా (సి) బాబర్‌ (బి) అయూబ్‌ 0; దూబే (రనౌట్‌) 27; రింకూ (నాటౌట్‌) 11; అక్షర్‌ (సి) అయూబ్‌ (బి) అఫ్రిది 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. 
వికెట్ల పతనం: 1–1, 2–88, 3–126, 4–126, 5–159, 6–175, 7–175. 
బౌలింగ్‌: సల్మాన్‌ 2–0–10–1, షాహిన్‌ అఫ్రిది 2–0–31–1, సయీమ్‌ అయూబ్‌ 4–0–25–3, అబ్రార్‌ 3–0–38–0, షాదాబ్‌ 1–0–17–0, నవాజ్‌ 4–0–28–0, తారిఖ్‌ 4–0–24–1.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) రింకూ (బి) పాండ్యా 0; అయూబ్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 6; సల్మాన్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 4; బాబర్‌ (బి) అక్షర్‌ 5; ఉస్మాన్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 44; షాదాబ్‌ (సి) దూబే (బి) తిలక్‌ 14; నవాజ్‌ (సి) దూబే (బి) కుల్దీప్‌ 4; ఫహీమ్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 10; అఫ్రిది (నాటౌట్‌) 23; అబ్రార్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 0; తారిఖ్‌ (బి) పాండ్యా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్‌) 114.  
వికెట్ల పతనం: 1–0, 2–6, 3–13, 4–34, 5–73, 6–78, 7–78, 8–97, 9–97, 10–114. 
బౌలింగ్‌: పాండ్యా 3–1–16–2, బుమ్రా 2–0–17–2, అక్షర్‌ 4–0–29–2, వరుణ్‌ 3–0–17–2, కుల్దీప్‌ 3–0–14–1, తిలక్‌ 2–0–11–1, రింకూ 1–0–9–0.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement