పనికిరాని వ్యక్తిని నమ్ముకుంటే ఇంతే: అక్తర్‌ ఫైర్‌ | Jahil: Shoaib Akhtar Lambasts Mohsin Naqvi After Pak Defeat Vs IND | Sakshi
Sakshi News home page

IND vs PAK: పనికిరాని వ్యక్తిని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది: అక్తర్‌ ఫైర్‌

Feb 16 2026 11:27 AM | Updated on Feb 16 2026 12:16 PM

Jahil: Shoaib Akhtar Lambasts Mohsin Naqvi After Pak Defeat Vs IND

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ తీరుపై ఆ దేశ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. అసమర్థులైన వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట పట్ల కనీస అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌ చేయడం అన్నిటికంటే పెద్ద నేరం అంటూ ఘాటు విమర్శలు చేశాడు.

61 పరుగుల తేడాతో చిత్తు
కాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు గత కొంతకాలంగా మిశ్రమ ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2026లో పసికూనలు నెదర్లాండ్స్‌, అమెరికాలపై గెలిచిన సల్మాన్‌ ఆఘా బృందం.. టీమిండియా ముందు మరోసారి తలవంచింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో చిత్తు ఓడిపోయింది.

ఫలితంగా తదుపరి నమీబియాపై భారీ విజయం సాధిస్తేనే సూపర్‌-8 అవకాశాలను పాక్‌ సజీవం చేసుకోగలదు. ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ చైర్మన్‌, మంత్రి మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) విధానాలను ఘాటుగా విమర్శించాడు.

పనికిరాని వ్యక్తులు.. వీరిని నమ్ముకుంటే ఇంతే
‘‘షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi) గంటకు 125 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆధునిక క్రికెట్‌లో ఇలాంటి చెత్త టాలెంట్‌ అవసరం లేదు. ఇక ఇంకో ప్లేయర్‌ (బాబర్‌ ఆజం)ను సూపర్‌ స్టార్‌ చేస్తారు. కానీ అతడు మీకోసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేడు.

ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అసలు తాను పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ని అన్న విషయం గుర్తుందో లేదో కూడా తెలియదు. అలాంటి పనికిరాని వ్యక్తులు జట్టును ఎలా రన్‌ చేయగలరు? ఈ ప్రపంచంలో అసమర్థ వ్యక్తిని అందలం ఎక్కించడమే అన్నిటికంటే పెద్ద నేరం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది.

ఆయనొక అసమర్థుడు.. ఆట పట్ల ఏమాత్రం అవగాహన లేని వాడు. గత 15-20 ఏళ్లుగా పాక్‌ క్రికెట్‌ను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. టీమిండియాను ఓడించడం మనకు ఓ కలగానే మిగిపోయింది’’ అని అక్తర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

గతేడాది అలా
అదే విధంగా.. సీనియర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏమిటని అక్తర్‌ ప్రశ్నించాడు. కాగా పాక్‌పై గెలుపుతో హ్యాట్రిక్‌ విజయం అందుకున్న టీమిండియా సూపర్‌-8కు చేరగా.. పాక్‌ రాత తదుపరి మ్యాచ్‌ ఫలితంతో తేలుతుంది. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ సూపర్‌-8 కూడా చేరకుండానే గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

చదవండి: నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్‌ యాదవ్‌పై హార్దిక్‌, సూర్య ఫైర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement