ఇటలీ క్రికెట్ బోర్డులో కలకలం రేగింది. వారి దేశ మహిళా జట్టు ప్రధాన కోచ్ ప్రభాత్ ఎక్నెలిగోడాపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది ఆ దేశ జాతీయ మహిళా క్రికెటరే. గాయపడిన సమయంలో ప్రభాత్ అనుచితంగా ప్రవర్తించాడని.. గాయానికి మసాజ్ చేసే సమయంలో పరిధి దాటి ప్రవర్తించాడని రోమ్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను ప్రభాత్ ఖండించాడు. మొత్తంగా ఈ ఘటన ఇటలీ క్రికెట్‌లో కలకలం రేపింది.
శ్రీలంకకు చెందిన ప్రభాత్‌పై ఇదివరకే చాలా ఆరోపణలు ఉన్నాయి. అతన్ని మహిళా క్రికెట్ జట్టు విధుల నుంచి అధికారికంగా తప్పించడినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో ఇటలీ జట్టు అధికారిక గుర్తింపు కార్డు ధరించి కనిపించాడు. ఈ విషయం కూడా వివాదాస్పదమైంది. మహిళా జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించినా కూడా ఇంకా ఆ జట్టు శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నాడని విమర్శలు ఉన్నాయి.
క్రికెట్ ఇటాలియా (ఇటలీ క్రికెట్ బోర్డు) వెబ్‌సైట్‌లో అతని పేరు తొలగించినా, అక్రమంగా ఆ విధుల్లో కొనసాగుతున్నాడని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తంగా ప్రభాత్ ఉదంతం ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తున్న ఇటలీ క్రికెట్‌ను ఓ కదుపు కుదుపుతుంది. ప్రభాత్ ఎడిసోడ్‌కు బాధ్యత వహిస్తూ.. ఇటలీ క్రికెట్ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటలీ మహిళల జట్టు ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉంది. ఇటీవల వారు మంచి ప్రగతి సాధించారు. 2025 యూరప్ క్వాలిఫయర్‌లో నెదర్లాండ్స్, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో 2026 మహిళల టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయారు.
మరోవైపు ఇటలీ పురుషుల జట్టు ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసి యావత్ క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. గ్రూప్ దశలో ఆ జట్టు నేపాల్‌పై సాధించిన విజయం ఆ దేశ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇటలీ ఏ ఫార్మాట్‌లో అయినా ప్రపంచకప్ ఆడటం ఇదే మొదటిసారి. అరంగేట్రం ఎడిషన్‌లోనే ఆ జట్టు మెరుగైన ప్రదర్శనలు చేసి శభాష్ అనిపించుకుంది.


