ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను నియమించుకుంది. రోడ్స్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఫీల్డింగ్ పరంగా లక్నో ప్రదర్శన గత సీజన్‌లో దారుణంగా ఉండింది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేశారు. మిస్ ఫీల్డింగ్ కారణంగా చాలా పరుగులు అదనంగా వచ్చాయి. ఈ ఫీల్డింగ్ తప్పిదాలే పలు మ్యాచ్‌ల్లో లక్నో కొంపముంచాయి. ఈ కారణంగానే లక్నో మేనేజ్‌మెంట్ దిగ్గజమైనా జాంటీ రోడ్స్‌ను తప్పించింది.
గత సీజన్‌లో రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో టీమ్ కేవలం 6 విజయాలు మాత్రమే సాధించి, ఏడో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌కి చేరలేకపోవడంతో యాజమాన్యం పెద్ద ఎత్తున మార్పులు చేపట్టింది. జట్టు లోగో, జెర్సీ డిజైన్ కూడా కొత్తగా రూపొందించింది.
కోచింగ్ అనుభవం
అభయ్ శర్మ ఉగాండా జట్టును 2024లో తొలిసారి టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించేలా చేశాడు. ఇప్పుడతను తన అంతర్జాతీయ అనుభవాన్ని LSGకి తీసుకువస్తున్నాడు. అభయ్.. 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేసి, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, అర్షదీప్ సింగ్ వంటి నేటి తారలను తీర్చిదిద్దాడు
వికెట్‌కీపర్ అయిన అభయ్.. తన అనుభవంతో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశారు. అదనంగా, భారత మహిళా జట్టుకి కూడా కోచ్‌గా సేవలందించారు.
ఆటగాడిగా..
అభయ్ కోచింగ్‌కు ముందు భారత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఢిల్లీ, రైల్వేస్ జట్ల తరఫున 129 మ్యాచ్‌లు ఆడారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడి 4105 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. లిస్ట్-A క్రికెట్లో 40 మ్యాచ్‌లు ఆడి 780 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధశతకం ఉంది. వికెట్‌కీపింగ్ రికార్డు: మొత్తం 210 డిస్మిసల్స్ (165 క్యాచ్‌లు, 45 స్టంపింగ్స్).


