టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే సూర్య సేన కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచన చేశాడు.
ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు డకౌట్లు ఉండడం గమనార్హం. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
"నేను గనుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అతడి స్ధానంలో సంజూ శాంసన్‌ను అవకాశమిస్తాను. ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది చాలా కీలకమైన మ్యాచ్. కాబట్టి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.
తుది జట్టు ఎంపికలో మార్పులు కచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భారత్ సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేరన్న విషయం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.


