IND vs ZIM: హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం.. భారత్‌ భారీ స్కోరు | T20 WC IND vs ZIM: Abhishek Hardik Tilak Shines IND Huge Score | Sakshi
Sakshi News home page

IND vs ZIM: హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం.. భారత్‌ భారీ స్కోరు

Feb 26 2026 8:46 PM | Updated on Feb 27 2026 10:15 AM

T20 WC IND vs ZIM: Abhishek Hardik Tilak Shines IND Huge Score

జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.

అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
ఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (24) నిరాశపరచగా.. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం
కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), తిలక్‌ వర్మ దంచికొట్టారు. హార్దిక్‌ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

హార్దిక్‌ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

రికార్డు స్కోరు
కాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్‌ నిలిచింది. తాజాగా భారత్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్‌ రాబట్టింది.

చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం

Advertisement
 
Advertisement
Advertisement