ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.
ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్ రన్‌రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్ (-0.100) కంటే విండీస్ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.
భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేది
నిజానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్‌రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌
A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌
ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026
ముఖ్యంగా అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.
మా బ్యాటర్లు సూపర్.. కానీ బౌలర్లే
ఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్‌కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.
అదరగొట్టిన అర్ష్‌దీప్
కాగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తలా ఒక్క వికెట్ తీశారు.
భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్లు
👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై
👉భారత్: 256/4(20)
👉జింబాబ్వే: 184/6(20)
👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్ గెలుపు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్


