ధ‌న్య‌వాదాలు.. సంజు సామ్స‌న్‌ | Cricketer Sanju Samson offers the real Kerala story says Netizens | Sakshi
Sakshi News home page

Sanju Samson: గొప్ప ఇన్నింగ్స్‌.. అభినంద‌న‌లు

Mar 2 2026 6:32 PM | Updated on Mar 2 2026 7:14 PM

Cricketer Sanju Samson offers the real Kerala story says Netizens

చ‌క్క‌టి ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించి సెమీస్‌కు చేర్చిన టీమిండియా బ్యాట‌ర్ సంజు సామ్స‌న్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టి20 ప్ర‌పంచ‌క‌ప్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రివ‌ర‌కు క్రీజ్‌లో నిల‌బ‌డి విజ‌యాన్ని అందించిన ఈ కేర‌ళ క్రికెట‌ర్‌పై అభిమానుల‌తో పాటు ప్ర‌ముఖులు పొగుడుతున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రానికి చెందిన సినిమా స్టార్స్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సంజు సూప‌ర్ ఇన్నింగ్స్ కీర్తిస్తూ మాలీవుడ్ ప్ర‌ముఖులు మోహన్‌లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, బాసిల్ జోస‌ఫ్‌, న‌విన్ పాలీ త‌దిత‌రులు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.

విజ‌య‌కేత‌నం ఎగురవేయండి
మాస్ట‌ర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సంజు సామ్స‌న్ స‌త్తా చాటాడని ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌లాల్‌ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సంజు ఫామ్‌లోకి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. సెమీ-ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియాకు అభినంద‌న‌లు తెలిపారు. సెమీస్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగురవేయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

 

స్వచ్ఛమైన ఆధిపత్యం
సంజు సామ్స‌న్ అద్భుతంగా ఆడాడ‌ని విల‌క్ష‌ణ న‌టుడు మ‌మ్ముట్టి ప్ర‌శంసించారు. అతిపెద్ద వేదిక‌పై స్వచ్ఛమైన ఆధిపత్యం చెలాయించారని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు ఫొటో పోస్ట్ చేసి హార్ట్‌, క్లాప్స్ ఎమోజీల‌ను జోడించారు.

 

చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్
'టి20 గొప్ప ఇన్నింగ్స్‌లో ఇదీ ఒక‌టి. కీల‌క క్వార్ట‌ర్ ఫైనల్లో సంజు సామ్స‌న్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడ‌'ని నటుడు-చిత్రనిర్మాత- ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.  “నిన్ను చూసి గర్వంగా ఉంది మచా. (మిత్రుడు)” అని నటుడు కాళిదాస్ జయరామ్ మెచ్చుకున్నారు. వాట్ యాన్ ఇన్నింగ్స్ అంటూ న‌టుడు టొవినో థామస్ పొగిడారు. 'థ్యాంక్యూ సంజు సామ్స‌న్' అంటూ ప్ర‌కాశ్‌రాజ్ అభినందించారు.

 

ది రియ‌ల్ కేర‌ళ స్టోరీ
కాగా, కేర‌ళ స్టోరీ 2 సినిమాకు కొంత‌మంది కౌంట‌ర్ ఇచ్చారు. త‌మిళ‌ దర్శకుడు సిఎస్ అముధన్ సంజు విజయాన్ని ‘ది కేరళ స్టోరీ: టీమిండియాను సంజు సామ్స‌న్ సెమీస్ ఫైన‌ల్‌కు చేర్చాడ‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత సంజు చేసిన ప్రార్థ‌న‌లు మ‌త‌సామ‌ర‌స్యానికి చిరునామాగా నిలిచాయ‌ని, ఇదే రియ‌ల్ కేర‌ళ స్టోరీ అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. ఎవ‌రినీ హర్ట్ చేయ‌కుండా అన్ని మ‌తాల‌ను గౌర‌వించాడ‌ని పేర్కొంటూ ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement