టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్
వెస్టిండీస్‌పై 5 వికెట్లతో ఘన విజయం
సామ్సన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్
గురువారం ముంబైలో ఇంగ్లండ్‌తో సెమీస్ పోరు
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు.
ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్‌లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్‌లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది.
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్‌లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్‌తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రావ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.
సమష్టి ప్రదర్శన...
తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్‌లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్‌కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్‌ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది.
వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్‌లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్‌మైర్‌తో పాటు ఛేజ్‌ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్‌ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు.
15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్‌కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు.
రాణించిన తిలక్...
ఛేదనలో భారత్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు.
ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్‌కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.
97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్‌లపై)గా నిలిచాడు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్‌మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్‌ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్‌మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్‌ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0.



