‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.
ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.
This team! 🥹💙🫂
Next Stop: Semi-finals 🚀
ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్‌లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు.
అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లు
వేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
టాస్- భారత్.. తొలుత బౌలింగ్
వెస్టిండీస్ స్కోరు- 195/4(20)
భారత్ స్కోరు- 199/5 (19.2)
ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్).


