T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాదే గెలుపు | T20 WC 2026 SA Vs ZIM, South Africa Beat Zimbabwe In Formal Super Match, Check Out Score Details | Sakshi
Sakshi News home page

సికందర్‌ రజా ఒంటరి పోరాటం వృధా.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాదే గెలుపు

Mar 1 2026 6:34 PM | Updated on Mar 1 2026 7:05 PM

T20 WC 2026: South africa beat zimbabwe in formal super match

టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీకి రెడీ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్‌ క్లైవ్‌ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.

అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. 

ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0) విఫలమైనా.. రికెల్టన్‌ (31), బ్రెవిస్‌ (42), మిల్లర్‌ (22), స్టబ్స్‌ (21 నాటౌట్‌), లిండే (30 నాటౌట్‌) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3-0-22-1) వికెట్లు తీశారు. 

ఈ ఓటమితో ప్రపంచకప్‌లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement