సెమీఫైనల్‌ లక్ష్యంగా... | India and West Indies will clash today in the T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్‌ లక్ష్యంగా...

Mar 1 2026 3:57 AM | Updated on Mar 1 2026 3:57 AM

India and West Indies will clash today in the T20 World Cup 2026

నేడు భారత్, వెస్టిండీస్‌ పోరు 

గెలిచిన జట్టు సెమీస్‌కు 

ఆత్మవిశ్వాసంతో టీమిండియా 

బ్యాటింగ్‌నే నమ్ముకున్న విండీస్‌ 

రా. గం.7:00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం

టి20 ప్రపంచ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తమ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్‌లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్‌ కప్‌నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్‌ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం

కోల్‌కతా: టి20 వరల్డ్‌ కప్‌లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ‘క్వార్టర్‌ ఫైనల్‌’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌ చేరుకుంటుంది. ఓడిన టీమ్‌ టోర్నీనుంచి  నిష్క్రమిస్తుంది. 

అయితే రన్‌రేట్‌లో ప్రత్యర్థికంటే భారత్‌ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం జరిగితే విండీస్‌ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్‌ కప్‌లో రెండు టీమ్‌లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది.  

మార్పుల్లేకుండా... 
జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్‌మెంట్‌ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్‌ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్‌ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన సామ్సన్‌ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.

జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్‌ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్‌ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్‌ కూడా తన బ్యాటింగ్‌తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్‌లో కూడా మన టీమ్‌ పదునుగా ఉంది. స్పిన్‌ను పెద్దగా ఆడలేని విండీస్‌పై వరుణ్‌ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్‌ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు.  

బౌలింగ్‌లో రాణించేనా! 
వెస్టిండీస్‌ టీమ్‌ మొదటినుంచి తమ బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్‌లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్‌...  ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. 

అంతా సమష్టిగా చెలరేగితే భారత్‌పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్‌తో పోలిస్తే విండీస్‌ బౌలింగ్‌ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్‌ జోసెఫ్‌ ఫర్వాలేదనిపించే బౌలర్‌ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్‌ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత వెస్టిండీస్‌ మరే ఐసీసీ ఈవెంట్‌లో కూడా సెమీఫైనల్‌ చేరలేకపోయింది.

పిచ్, వాతావరణం 
ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్‌ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో 11 మ్యాచ్‌లలో తలపడిన వెస్టిండీస్‌ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్‌.  
వెస్టిండీస్‌: షై హోప్‌ (కెప్టెన్), కింగ్, హెట్‌మైర్, పావెల్, ఛేజ్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్‌.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
జింబాంబ్వే X దక్షిణాఫ్రికా
వేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి   
భారత్‌ X  వెస్టిండీస్‌
వేదిక: కోల్‌కతా, రాత్రి 7 గంటల నుంచి   
స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
 
Advertisement
Advertisement