టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందినప్పటికీ.. పాక్ సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
పాక్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్( 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. ఫఖార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు, షనక రెండు, చమీరా తలా వికెట్ సాధించారు.
వణికించిన షనక..
అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆఖరి వరకు పోరాడింది. లంక కెప్టెన్ దశున్ షనక విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ షా అఫ్రిది వేసిన ఆఖరి ఓవర్‌లో లంక విజయానికి 28 పరుగులు అవసరమయ్యాయి.
షనక తొలి బంతికి ఫోర్ కొట్టగా.. తర్వాత మూడు బంతులను సిక్సర్లగా మలిచాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. కానీ షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులేమి ఇవ్వలేదు. దీంతో లంక లక్ష్య చేధనలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
షనక కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కాగా పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను 146 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉండేది. కానీ పాక్ బౌలర్లు విఫలం కావడంతో పాక్‌కు బదులుగా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూపు-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టాయి.


