T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు! | Unhappy Mohsin Naqvi Set To Sack Salman Agha As PAK Captain: Report | Sakshi
Sakshi News home page

T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

Feb 28 2026 4:10 PM | Updated on Feb 28 2026 5:24 PM

Unhappy Mohsin Naqvi Set To Sack Salman Agha As PAK Captain: Report

టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఏమాత్రం సంతోషంగా లేరు
ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsin Naqvi)జట్టు ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఈసారి పాకిస్తాన్‌ మెరుగ్గా ఆడుతుందని సెలక్టర్లు, యాజమాన్యం ఆయనకు హామీ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా లేవు.

కెప్టెన్‌ సహా వారిపై వేటు
ముఖ్యంగా సల్మాన్‌ ఆఘా, బాబర్‌ ఆజం, ఉస్మాన్‌ ఖాన్‌ (Usman Khan)లతో పాటు మరికొంత మంది సీనియర్‌ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కానుంది. అంతేకాదు వాళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ఇంతటితో ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ తర్వాత పాకిస్తాన్‌ టీ20 జట్టులో భారీ మార్పులు చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాయి.

పసికూనలపై గెలిచి
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన లంకలో పాక్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌లతో కలిసి లీగ్‌ దశలో తలపడ్డ పాక్‌.. టీమిండియా చేతిలో మాత్రమే ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి గ్రూప్‌-ఎలో టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించి.. సూపర్‌-8కు చేరుకుంది.

లంకపై భారీ తేడాతో గెలిస్తేనే
అయితే, కీలక సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షార్ఫణం కాగా.. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పక భారీ విజయం సాధిస్తేనే పాకిస్తాన్‌ సెమీస్‌ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆసాంతం పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. దీంతో వారి కెరీర్‌ ముగించేలా పీసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement