టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ముందుగా సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల కోసం గ్రూప్-1 నుంచి టీమిండియా, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి.
పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే
ఇందులో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక (PAK vs SL) మధ్య శనివారం జరిగే ‘గ్రూప్–2’ సూపర్–8 మ్యాచ్ మూడో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక.. గెలిస్తే న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకుంటుంది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే మ్యాచ్‌లో గెలవడంతో పాటు రన్‌రేట్‌లో కూడా కివీస్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది.
64 పరుగుల తేడాతో గెలవాలి లేదా..
ఒకవేళ పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్ రన్‌రేటు పరంగా పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ (+1.390) సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీ క్రికెట్ మండలి (ICC) స్వయంగా చెప్పడం విశేషం. ఇక కోల్‌కతా వేదికగా ఆదివారం భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య జరిగే పోరు నాలుగో సెమీ ఫైనలిస్టును ఖరారు చేస్తుంది.
సౌతాఫ్రికా రెండు విజయాలతో
కాగా గ్రూప్ దశలో టాపర్లుగా నిలిచిన జట్లను సూపర్-8 గ్రూప్-1లో.. రెండో స్థానంతో ముగించిన జట్లను గ్రూప్-2లో సీడింగ్ చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా.. టీమిండియా, వెస్టిండీస్‌లపై గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-1 నుంచి ముందుగా సెమీస్ చేరింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్ ఆడుతుంది.
ఇంగ్లండ్ హ్యాట్రిక్
ఇక ఇప్పటికే జింబాబ్వే వెస్టిండీస్, టీమిండియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. గ్రూప్-2లో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గ్రూపు నుంచి ఇప్పటికే శ్రీలంక రెండు పరాజయాలతో ఎలిమినేట్ అయింది.
టీ20 ప్రపంచకప్-2026: శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్
👉వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం, శ్రీలంక
👉రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్


