సింగపూర్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ గ్రాండ్ స్మాష్ లెవెల్ టోర్నీలో మానవ్ ఠక్కర్–మనుశ్ షా (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆరో సీడ్ మానవ్–మనుశ్ ద్వయం 6–11, 11–7, 10–12, 11–9, 8–11తో నాలుగో సీడ్ ఫెలిక్స్ లెబ్రున్–అలెక్సిస్ లెబ్రున్ (ఫ్రాన్స్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.
36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట సొంత సర్వీస్‌లో 22 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 24 పాయింట్లు గెలిచింది. మూడో గేమ్‌లో 10–9తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. సెమీస్‌లో ఓడిన మానవ్–మనుశ్‌లకు 3,600 డాలర్ల (రూ. 3 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జంట రెండో రౌండ్‌లో 11–7, 11–5, 11–9తో గిలెర్మి టియోడోరో–లియోనార్డో ఇజుక (బ్రెజిల్)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–8, 11–9, 11–9తో మారి్టన్ అలెగ్రో–ఆడ్రియన్ రసెన్‌ఫోస్ (బెల్జియం)లపై గెలుపొందింది.


