సెమీస్‌లో ఓడిన భారత ఆటగాడు
వరల్డ్ చెస్ బ్లిట్జ్ చాంపియన్ షిప్
విజేత మాగ్నస్ కార్ల్‌సన్
దోహా: ‘ఫిడే’ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ర్యాపిడ్ విభాగంలో మూడో స్థానం సాధించిన భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశికి బ్లిట్జ్ విభాగంలోనూ కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన బ్లిట్జ్ ఈవెంట్ తొలి సెమీ ఫైనల్లో అర్జున్ 0.5–2.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్ నొదిర్‌బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అర్జున్ రెండో కాంస్యానికి పరిమితమయ్యాడు.
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఒకే వరల్డ్ చాంపియన్ షిప్ రెండు విభాగాల్లో (ర్యాపిడ్, బ్లిట్జ్) పతకాలు సాధించిన రెండో భారత ఆటగాడిగా అర్జున్ నిలవడం విశేషం. సత్తొరొవ్‌తో జరిగిన పోరులో తొలి రెండు గేమ్‌లలో అర్జున్ వరుసగా 47 ఎత్తుల్లో, 83 ఎత్తుల్లో పరాజయంపాలయ్యాడు.
తప్పనిసరిగా నెగ్గాల్సిన మూడో గేమ్ 33 ఎత్తుల తర్వాత ‘డ్రా’గా ముగిసింది. దాంతో నాలుగో గేమ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అర్జున్ ఓటమి ఖాయమైంది. రెండో సెమీఫైనల్లో కార్ల్‌సన్ చేతిలో 1–3తో ఫాబియానో కరువానా (అమెరికా) ఓటమిపాలయ్యాడు. టోర్నీ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిన అర్జున్, కరువానాలిద్దరికీ కాంస్యం అందించారు.
వీరిద్దరికి చెరో 28 వేల యూరోలు (సుమారు రూ.30 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్ టైబ్రేక్‌కు ముందు జరిగిన రెగ్యులర్ రౌండ్లలో అర్జున్ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆడిన 19 రౌండ్లలో 12 గెలిచి 6 డ్రా చేసుకొని ఒకటి మాత్రమే ఓడిన అర్జున్ నంబర్‌వన్‌గా ముగించాడు. అర్జున్‌తో పాటు టాప్–4లో నిలిచిన కరువానా (14), కార్ల్‌సన్ (13.5), అబ్దుస్సత్తొరొవ్ (13) సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.


