టీ20 ప్రపంచకప్-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐరీష్ జట్టు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా టక్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు.
డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమన్ బౌలర్లలో షకీల్ అహ్మద్ మూడు, కలీం రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.
ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు.


