హంపి, అర్జున్‌లకు కాంస్యాలు | Humpy and Arjun won bronze medals in the chess championship | Sakshi
Sakshi News home page

హంపి, అర్జున్‌లకు కాంస్యాలు

Dec 29 2025 3:01 AM | Updated on Dec 29 2025 3:01 AM

Humpy and Arjun won bronze medals in the chess championship

దోహా: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఈసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఓపెన్‌ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ కాంస్య పతకాన్ని నెగ్గాడు. మహిళల విభాగంలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జు జినెర్‌ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. 

మెరుగైన టైబ్రేక్‌ స్కోరులో జు జినెర్, గొర్యాక్‌చినా కంటే వెనుకబడి ఉండటంతో హంపికి మూడో స్థానం ఖరారైంది. విశ్వ విజేతను నిర్ణయించేందుకు గొర్యాక్‌చినా, జు జినెర్‌ల మధ్య రెండు గేమ్‌లు నిర్వహించగా... గొర్యాక్‌చినా 1.5–0.5తో జునెర్‌ను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. జు జినెర్‌కు రెండో స్థానం లభించింది. 

సవితాశ్రీ (భారత్‌)తో జరిగిన చివరిదైన 11వ గేమ్‌ను హంపి 64 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఒకవేళ హంపి ఈ గేమ్‌లో గెలిచిఉంటే 9 పాయింట్లతో మూడోసారి ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలిచేది. 2019, 2024లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హంపి 2012లో కాంస్యం, 2023లో రజతం సాధించింది. 

ఆనంద్‌ తర్వాత అర్జున్‌... 
ఓపెన్‌ విభాగంలో నిర్ణీత 13 రౌండ్ల తర్వాత అర్జున్‌ 9.5 పాయింట్లతో వ్లాదిస్లావ్‌ అర్తెమియెవ్‌ (రష్యా), హాన్స్‌ నీమెన్‌ (అమెరికా), లీనియర్‌ (అమెరికా)లతో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... అర్జున్‌కు మూడో స్థానంతోపాటు కాంస్య పతకం ఖరారైంది. 

ఈ టోర్నీ చరిత్రలో విశ్వనాథన్‌ ఆనంద్‌ (2017లో స్వర్ణం, 2014లో కాంస్యం) తర్వాత పతకం నెగ్గిన రెండో భారతీయ చెస్‌ ప్లేయర్‌గా అర్జున్‌ గుర్తింపు పొందాడు. అర్తెమియెవ్‌కు రెండో స్థానం, నీమెన్‌కు నాలుగో స్థానం, లీనియర్‌కు ఐదో స్థానం దక్కాయి. నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 10.5 పాయింట్లతో ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలిచాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement