వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్-2025లో కాంస్య పతకాలు గెలిచిన ఇరిగేశి అర్జున్, కోనేరు హంపిలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. వారి దృఢ సంకల్పం, ఆటతీరు, పోరాట స్ఫూర్తి అందరికీ గర్వకారణం అంటూ ఎక్స్ వేదికగా ఆయన కొనియాడారు.
కాగా దోహా వేదికగా జరిగిన ఈ వరల్డ్ మెగా ఈవెంట్‌లో హంపి మహిళల విభాగంలో ఆఖరి వరకు పోరాడింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జు జినెర్ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ టైబ్రేక్ స్కోరులో ఆమె మూడో స్దానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంస్య పతకం హంపి దక్కించుకుంది.
మరోవైపు ఓపెన్ విభాగంలో అర్జున్ 9.5 పాయింట్లతో మూడో స్దానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్‌కు ఇదే తొలి పతకం. ఇక 10.5 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచిన నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్.. ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.


