పిజ్జాలు తయారు చేసే షెఫ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ ’హీరో’ | Crishan Kalugamage: Pizza Chef Who Spun Italy To Historic T20 WC Win | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పిజ్జాలు తయారు చేసే షెఫ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ ’హీరో’

Feb 13 2026 12:56 PM | Updated on Feb 13 2026 1:32 PM

Crishan Kalugamage: Pizza Chef Who Spun Italy To Historic T20 WC Win

టీ20 ప్రపంచకప్‌-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది. నేపాల్‌తో గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ ఇటలీ అదరగొట్టింది. ముంబైలో గురువారం జరిగిన ఈ పోరులో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించడం విశేషం.

క్రిషాన్‌..  మోస్కా బ్రదర్స్‌ అదుర్స్‌
ఈ గెలుపులో అన్మదమ్ములు జస్టిన్‌ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్‌), ఆంటోని మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్‌)లతో పాటు లెగ్‌ స్పిన్నర్‌ క్రిషాన్‌ కలుగమగేది కీలక పాత్ర. 

నేపాల్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కలుగమగే ప్రధాన భూమిక పోషించగా.. లక్ష్య ఛేదనలో మోస్కా బ్రదర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇటలీకి తొలి విజయం అందించిన ఈ ముగ్గురు.. ఇటలీ వెలుపల జన్మించిన వారే కావడం గమనార్హం.

మోస్కా బ్రదర్స్‌ తల్లిదండ్రులు ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా.. వీరిద్దరు సిడ్నీలో జన్మించారు. అయితే, ఆ తర్వాత క్లబ్‌ స్థాయి క్రికెట్‌లో మెళకువలు నేర్చుకుని ఇటలీకి తిరిగి వచ్చి తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు.

శ్రీలంకలో పుట్టి పెరిగి
ఇక క్రిషాన్‌ కలుగమగేది మరో స్టోరీ. అతడు శ్రీలంకలో జన్మించాడు. క్రికెట్‌ అంటే అతడికి  పిచ్చి అని చెప్పవచ్చు.  చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న కలుగమగే అండర్‌–15 స్థాయి వరకు శ్రీలంకకే ఆడాడు.

అయితే అదే సమయంలో కలుగమగే కుటుంబం ఇటలీ వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటలీలో ఈ ఆట ఉండదు కాబట్టి తన క్రికెట్‌ కెరీర్‌ కోల్పోతానని భయంతో అతను వెళ్లడానికి ఇష్టపడలేదు. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు తప్పలేదు. అయితే అక్కడికి వెళ్లాక క్రికెట్‌ అవకాశాలు రావడంతో పాటు... పరిస్థితి మారి ఏకంగా వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

పిజ్జాలు చేసే షెఫ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ ’హీరో’
నిజానికి కలుగమగే ప్రొఫెషనల్‌ షెఫ్‌. ఇటాలియన్‌ స్పెషల్‌ పిజ్జాలు తయారు చేసే ‘లా విటా పిజారియా’ అనే హోటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ‘షెఫ్‌’గా అతడు పని చేస్తాడు. కాబట్టి కేవలం ఆదివారాల్లో మాత్రమే అతడికి క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సాధన చేసే కలుగమగే ఏకంగా వరల్డ్‌కప్‌ హీరోగా నిలవడం విశేషం.

ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో 34 ఏళ్ల ఈ రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.. కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఐరీ (17), గుల్షాన్‌ ఝా (3) రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కలుగమగే కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.

123 పరుగులకే
మ్యాచ్‌ విషయానికొస్తే... టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్‌ షేక్‌ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, కెప్టెన్‌రోహిత్‌ పౌడేల్‌ (23), ఆసిఫ్‌ షేక్‌ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇతర ప్రధాన బ్యాటర్లు కుశాల్‌ భుర్తేల్‌ (5), దీపేంద్ర సింగ్‌ ఐరీ (17) ప్రభావం చూపించలేకపోవడంతో నేపాల్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇంగ్లండ్‌పై గత మ్యాచ్‌లో 17 ఫోర్లు, 7 సిక్స్‌లు బాదిన నేపాల్‌ బ్యాటర్లు ఈసారి.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు మాత్రమే నమోదు చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లెగ్‌ స్పిన్నర్‌ క్రిషాన్‌ కలుగమగే (3/18) మూడు కీలక వికెట్లతో జట్టును దెబ్బ తీశాడు.

మరో 44 బంతులు మిగిలి ఉండగానే
అనంతరం ఛేదనలో ఇటలీ ఎక్కడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంటోనీ మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), జస్టిన్‌ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.   

చదవండి: IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్‌ గొడవ.. తప్పెవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement