టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో నమీబియాను 93 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లోనూ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. వాంఖడే వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేనప్పటికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు చాలా కీలకంగా మారింది.
క్లిష్ట సమయంలో వారిద్దరూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా జస్ప్రీత్ తన రిథమ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తున్నారు. వారిద్దరిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మా తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో భారత్ తలపడనుంది.
భారత్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో 116 పరుగులకే కుప్పకూలింది.


