PC: BCCI/X.com
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఆట ఆరంభంలో పంత్(39) కాస్త దూకుడుగా ఆడినప్పటికి ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా తొలి రోజు ఆటలో కండరాల గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికి సెంచరీ హీరో దేవ్‌దత్త్ పడిక్కల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ ధ్రువ్ జురల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ అనుహ్యంగా స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ జట్టును ఇన్నింగ్స్‌ను నడిపించే భాధ్యతను తీసుకున్నాడు.
ఈ క్రమంలో జురెల్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జురెల్(51), మానవ్ సుత్తార్(24) వరుస ఓవర్లలో ఔటయ్యాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సిక్సర్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్.. గాలే టెస్ట్‌లో కూడా తన బ్యాట్‌కు పనిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 15 బంతుల్లో ఒక సిక్సర్‌తో 11 పరుగులు చేసి సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జైసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు.


