మూడో స్థానంపై బేఫిక‌ర్‌.. గిల్ న‌మ్మినబంటు పడిక్క‌ల్‌ | Devdutt Padikkal Answers Shubman Gill’s Faith With A Stunning Maiden Test Century, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మూడో స్థానంపై బేఫిక‌ర్‌.. గిల్ న‌మ్మినబంటు పడిక్క‌ల్‌

Aug 16 2026 8:42 AM | Updated on Aug 16 2026 12:36 PM

Padikkal-Strengthen-Number-3 Spot-Maiden-Ton-Gill-Hopes-True

దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్‌ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్‌ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫ‌లితంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ న‌మ్మ‌కాన్ని ఒక్క శ‌త‌కంతో ప‌డిక్క‌ల్‌ నిలబెట్టుకున్నాడు. 

'లంక‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవ‌రు వ‌స్తున్నారు?' అనే ప్ర‌శ్న గిల్‌కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ పేరును బ‌య‌టికి చెప్పాడు. మూడో స్థానంలో అంత‌కంటే మంచి బ్యాట‌ర్‌ను తాను చూడ‌లేద‌ని, ఈ సిరీస్‌లో ప‌డిక్క‌ల్ బ్యాటింగ్‌కు వెన్నుముక‌లా మారుతాడని గిల్ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూప‌ర్ సెంచ‌రీతో గిల్‌కు న‌మ్మిన బంటు అయ్యాడు ప‌డిక్క‌ల్‌.

2024లో అనూహ్య పిలుపు..
2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన దేవదత్‌ పడిక్కల్‌ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్‌ సిరీస్‌కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్‌ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్‌కు ఆ అవకాశం వచ్చింది. 

రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్‌ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్‌ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. 

స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్‌ షాట్‌లు ఆడిన పడిక్కల్‌... పేసర్లకు ‘నటరాజ్‌’ షాట్‌లతో బదులిచ్చాడు. స్క్వేర్‌ లెగ్‌ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్‌మార్క్‌ పంచ్‌ షాట్‌లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. 

రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ త‌ర్వాత త‌న స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ప‌డిక్క‌ల్‌కు ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌ళ్లీ రాదు. ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తే మాత్రం ప‌డిక్క‌ల్ స్థానానికి ఢోకా ఉండ‌దు.

Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్‌.. గాయంపై బిగ్ అప్‌డేట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement