చైనాతో ఢీకి మన జట్టు సిద్ధం
సా.4:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం
ఆమ్‌స్టెల్‌వీన్: హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తమ తొలి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ ‘డి’ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ చైనాతో మ్యాచ్ మన జట్టుకు అంత సులువు కాదు. ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో ఉన్న భారత్ గెలుపు కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. కోచ్ జోయెర్డ్ మరీన్ శిక్షణలో ఇటీవల జట్టు రాటుతేలిన తీరు అంచనాలను పెంచుతోంది.
ఇదే పూల్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలంటి పటిష్ట జట్లు ఉండటంతో భారత్ తొలి మ్యాచ్‌లో ఏమాత్రం ఉదాసీనత చూపించడానికి లేదు. యూరోపియన్ పరిస్థితులను అలవాటు పడేందుకు కొంతకాలంగా అక్కడే ఉండి మ్యాచ్ వేక వాగ్నర్ స్టేడియంలో సాధన చేసిన భారత మహిళలు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆతిథ్య నెదర్లాండ్స్‌తో కూడా తలపడ్డారు.
మన టీమ్‌లోని 11 మందికి ఇదే తొలి వరల్డ్ కప్. అయితే గోల్ కీపర్ సవిత పూనియా (313 మ్యాచ్‌లు), సుశీల చాను (262 మ్యాచ్‌లు) వంటి అత్యంత అనుభవజు్ఞలతో నిండిన జట్టులో 200కు పైగా మ్యాచ్‌లు ఆడిన నవ్‌నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహ గోయల్‌వంటి ప్లేయర్లు ఉన్నారు. డ్రాగ్‌ఫ్లికర్ దీపిక ప్రదర్శన ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. గత ఏడాది ఆసియా కప్‌లో చైనా 4–1తో భారత్‌ను ఓడించింది.


