అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను తప్పించుకునేందుకు చైనా చేపడుతున్న చట్టవిరుద్ధ రవాణాకు భారత్‌తో పాటు మరో 40 దేశాలు సహకరిస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ రకమైన షాడో ట్రాన్స్-షిప్‌మెంట్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్న చట్టవిరుద్ధ రవాణాను గుర్తించి అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించనున్నట్లు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార, తయారీ రంగానికి సంబంధించిన సలహాదారు పీటర్ నవారో రూపొందించిన ‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ అనే నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల ద్వారా ఏటా అక్రమంగా రవాణా అవుతున్న వస్తువుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు నుంచి 303 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
చైనాకు సహకారం..
అమెరికా సుంకాల నుంచి చైనా తప్పించుకోవడానికి సహకరిస్తున్న ప్రాంతాల్లో భారత్‌కు చెందిన పుణె - గుజరాత్ - చెన్నై బెల్ట్‌ను అమెరికా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనా ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను మూడో దేశం ద్వారా రవాణా చేస్తూ స్వల్పంగా అసెంబ్లీ చేయడం, ఫినిషింగ్, రీప్యాకేజింగ్ లేదా లేబుళ్లు మార్చడం ద్వారా ఆ వస్తువు వేరే దేశంలో తయారైనట్లు భ్రమ కల్పిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ అక్రమ రవాణాలో భాగమైన భారతీయ ఎగుమతిదారులను లేదా సంబంధిత సంస్థల పేర్లను ఈ నివేదిక స్పష్టంగా ప్రస్తావించలేదు.
నివేదికలోని ముఖ్యాంశాలు
చైనా నుంచి మెక్సికో, భారత్, వియత్నాంల ద్వారా అమెరికాకు దాదాపు 67 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యాయని తెలిపింది. దీనివల్ల అమెరికా సుమారు 28 బిలియన్ డాలర్లు సుంకాల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా వేసింది. భారత్, కెనడా, ఈయూ వంటి దేశాలను టైర్-1 కేటగిరీలో చేర్చారు. చైనా ఉత్పత్తుల భారీ విక్రయాలు జరుపుతూనే విభిన్న పారిశ్రామిక స్థావరాలు కలిగి ఉన్న దేశాలుగా వీటిని పేర్కొన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియాలు టైర్-2 జాబితాలో ఉన్నాయి. కంబోడియా, లావోస్, మైన్మార్‌లు చైనాతో సరిహద్దు కారిడార్లు కలిగి ఉన్న దేశాలు టైర్-3 స్థానంలో పొందాయి.
తాజా పరిణామాలు.. ప్రభావం
భారత్‌పై అమెరికా సెక్షన్ 301 కింద 10% టారిఫ్‌లు విధించడంతో పాటు ఫోర్స్డ్ లేబర్ (వెట్టి చాకిరీ) అంశంపై విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ నివేదిక వెలువడటం గమనార్హం. అంతేకాకుండా రష్యన్ ఆయిల్, గ్యాస్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నందున భారత్‌పై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే చట్టాన్ని ఆమోదించే దిశగా కూడా అమెరికా ఆలోచిస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో భారత్‌పై అమెరికా తనిఖీలను పెంచడానికి, ఎగుమతుల్లో ఆలస్యానికి, కఠినమైన జరిమానాలకు దారితీయవచ్చని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..


