గుహవటి: అసోంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 48 గంటలుగా కనిపించకుండా పోయిన 52 ఏళ్ల బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ చివరకు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అసోంలోని శ్రీభూమి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చాగల్మోవా గ్రామానికి చెందిన ధర్ ఆగస్టు 12న తన మోటార్‌సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తూ నిందితుల వరకు చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం అసోం-త్రిపుర సరిహద్దుకు సమీపంలోని జోగిచ్ఛరా ప్రాంతంలో ఓ చెరువు వద్ద ధర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, విచారణలో ఒక నిందితుడు ధర్‌ను మాచెటీతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు రాజకీయ కారణం ఉందా, లేక వ్యక్తిగత కక్షే కారణమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వ్యక్తిగత వైరం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం..
దర్యాప్తు సమయంలో మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ఓ కానిస్టేబుల్‌పై పదునైన వస్తువుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, నిందితుడి ఎడమ కాలికి బుల్లెట్ గాయం అయింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆందోళనలు, ఉద్రికత్త..
ధర్ మృతదేహం లభ్యమైన వార్తతో చాగల్మోవా, బజారిచెర్రా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల విధ్వంసం, నిప్పంటించే ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పంటించినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా జిల్లా యంత్రాంగం BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు హత్యకు కారణం ఏమిటి? ఆరుగురు నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది.


