ఢిల్లీ: దేశంలో కొత్త తరహా శత్రువుగా ‘మానసిక నక్సల్స్’ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని ఎర్రకోట పై నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ఆయన.. అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో ఇలాంటి భావజాలం ఉన్న వారు పాతుకుపోయారని తెలిపారు. వారిని గుర్తించి, ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.
ఎర్రకోట వేదికగా నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు దేశంలోని అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా వ్యవహరిస్తూ విధానాలపై ఆ భావజాల ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతరించినప్పటికీ.. ‘మానసిక నక్సల్స్’ మాత్రం ఇంకా ఉన్నారు ఈ భావజాలాన్ని కలిగి ఉన్నవారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. హింస, సామాజిక విభేదాలకు మార్గం సుగమం చేస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు వారు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు" అని మోదీ అన్నారు.
అయితే అడవుల్లో ఉన్న సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించడంలో దేశం విజయం సాధించిందని, తద్వారా ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెప్పారు. ఇప్పుడు మనం ఈ మానసిక నక్సల్స్‌ను గుర్తించాలి, వారిని ఒంటరి చేయాలి. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో యువతను ప్రధాన స్రవంతి కృషితో అనుసంధానం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ యువతను సరైన దిశలో నడిపిస్తూ, అభివృద్ధి లక్ష్యాల వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఎర్ర ఉగ్రవాదం తుపాకీ తూటాలతో దేశంలోని పలు ప్రాంతాలను సంవత్సరాల తరబడి బందీలుగా ఉంచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను రక్షించేందుకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో 3,500 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుద్ధాల్లో మరణించే వారి సంఖ్య కంటే ఇది ఎక్కువని ఆయన పేర్కొన్నారు. 80 ఏళ్ల క్రితం భారత్ స్వాతంత్ర్యం సాధించగా, ఇప్పుడు నక్సలిజం పట్టు నుంచి దేశం మరోసారి విముక్తి పొందుతోందని అన్నారు.


