సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ | Independence Day 2026 LIVE: PM Modi at Red Fort Nation’s Address | Sakshi
Sakshi News home page

సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ

Aug 15 2026 7:24 AM | Updated on Aug 15 2026 12:26 PM

Independence Day 2026 LIVE: PM Modi at Red Fort Nation’s Address

సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్‌ భారత్‌ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

వికసిత్‌ భారత్‌ కోసం సప్తధార ప్రణాళిక

  1. తయారీ శక్తి
  2. ఫుడ్‌ ప్రొడక్షన్‌
  3. టెక్నాలజీ
  4. గతిశక్తి
  5. రక్షణ రంగం
  6. గ్రీన్‌ ఎకానమీ.. బ్లూ ఎకానమీ
  7. యువశక్తి

25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
తమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాం
గత 12 ఏళ్లలో భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్‌, డీజిల్‌, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.

సంస్కరణలు మరింత వేగంగా..
ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్‌ రైలు, సెమీకండక్టర్‌ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌.. మేడిన్‌ ఇండియానే లక్ష్యం
భారత్‌ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్‌ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్‌ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్‌కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్‌ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.

ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుంది
దేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

యువత తోడుంటేనే..
దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్‌ భారత్‌ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్‌ భారత్‌ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్‌ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌, సప్లై చైన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన.

 

 

మహిళా బిల్లుకు ముందుకు రండి
మహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్‌ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

తొలిసారి ఎర్రకోటపై వందేమాతరం
ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. 

వేడుకలు ఇలా.. 
స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్‌ సెల్యూట్‌, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement