కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే!


