వినేశ్‌ ఫొగాట్‌ సంచలన ఆరోపణలు | Vinesh Phogat Vows to Continue Fight After Brij Bhushan's Acquittal | Sakshi
Sakshi News home page

మొదటి నుంచీ అంతే: వినేశ్‌ ఫొగాట్‌ సంచలన ఆరోపణలు

Aug 3 2026 1:59 PM | Updated on Aug 3 2026 2:05 PM

Not lost hope: Vinesh Phogat vows to continue fight Brij Bhushan acquittal

వినేశ్‌ ఫొగాట్‌ (PC: X)

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో అతడికి క్లీన్‌చిట్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్రిజ్‌భూషణ్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ను కూడా నిర్దోషిగా తేల్చింది.

ఈ నేపథ్యంలో భారత స్టార్‌ రెజ్లర్‌, ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఘాటుగా స్పందించింది. మొదటి నుంచీ వ్యవస్థ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు.. ‘‘బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించేందుకు మేము ఢిల్లీ వీధుల్లో పోరాడాల్సి వచ్చింది.

అతడు తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కొంత మంది అమ్మాయిలను ఈ కేసు నుంచి ఉపసంహరించుకునేలా బలవంతం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిజ్‌భూషణ్‌పై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు.

కానీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో కోర్టు బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించడం అత్యంత విచారకరం. మొదటి నుంచి అతడిని కాపాడేందుకు వ్యవస్థ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో హైకోర్టుకు అప్పీలు చేసేలా ఇప్పటికే చాలా మంది మహిళా రెజ్లర్లు తమ న్యాయవాదులకు సందేశం ఇచ్చారు.

ఇప్పటికీ మేము ఆశను కోల్పోలేదు. బ్రిజ్‌భూషణ్‌ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతుంది’’ అని వినేశ్‌ ఫొగాట్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కాగా బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు.

అయితే, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని రాజధానిలో రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ వారికి మద్దతుగా జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆరోపణలు చేసిన ఆరుమంది రెజ్లర్లలో ఓ మైనర్‌ కూడా ఉండటంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఆ తర్వాత ఆమె కేసును ఉపసంహరించుకోవడంతో బ్రిజ్‌భూషణ్‌కు భారీ ఊరట దక్కింది. తాజాగా.. మిగిలిన కేసుల్లోనూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం. అయితే, రెజ్లర్లు హైకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమైనట్లు వినేశ్‌ ఫొగాట్‌ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement