దేశీయ మద్యం మార్కెట్‌లో దశాబ్దాలుగా విశేష ప్రజాదరణ పొందిన పలు ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) భారీ షాక్ ఇచ్చింది. నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో పాటు కృత్రిమ సువాసనలు (ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు) వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేబులింగ్ విధానాలను పాటిస్తున్నందుకు డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్), ఇన్ బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన కొన్ని నిర్దిష్ట రమ్, విస్కీ వేరియంట్ల అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
ల్యాబొరేటరీ పరీక్షల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీలతో పాటు ఓల్డ్ మాంక్, మెక్‌డొవెల్స్ నంబర్-1, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్ వేరియంట్లలో సహజ సిద్ధమైన ఏజింగ్ (మ్యాచ్యురేషన్) ప్రక్రియకు స్వస్తి చెప్పి కృత్రిమ లేదా 'నేచర్ ఐడెంటికల్' ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా మొలాసెస్ లేదా మాల్ట్ వంటి ప్రాథమిక పదార్థాలను పులియబెట్టి ఈస్ట్ చర్య ద్వారా లభించే సహజ రుచి, సువాసనలకు బదులుగా విస్కీలో 'విస్కీ ఫ్లేవర్', రమ్‌లో 'రమ్ ఫ్లేవర్'లను కలపడం అంతర్జాతీయ తయారీ ప్రమాణాలకు విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. కాఫీ, వెనిలా వంటి ఇతర రుచులను జోడించడానికి అనుమతి ఉన్నప్పటికీ మద్యం అసలు నమూనానే కృత్రిమంగా సృష్టించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.
లేబులింగ్‌పై మద్యం తయారీ తేదీ ప్రకటనలకు (Age claims) సంబంధించి కూడా తీవ్ర అతిక్రమణలు వెలుగులోకి వచ్చాయి. 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్‌గా ప్రచారం చేసుకుంటున్న ఒక రమ్ వేరియంట్‌లో నిజమైన మెచ్యూర్డ్ రమ్ వాటా 5 శాతం కంటే తక్కువగా ఉండి అత్యధిక భాగం సాధారణ న్యూట్రల్ స్పిరిట్ మాత్రమే ఉన్నట్లు తేలింది. 2018 ఆల్కహాలిక్ బెవరేజెస్ నిబంధనల ప్రకారం బ్లెండెడ్ మద్యంలో ఉండే అతి తక్కువ వయసు కలిగిన స్పిరిట్ ఆధారంగానే 'ఏజ్' ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఉత్పత్తులను కేవలం విస్కీ లేదా రమ్ అని కాకుండా బాటిల్ ముందు భాగంలో స్పష్టంగా 'విస్కీ-ఫ్లేవర్డ్ స్పిరిట్' లేదా 'రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్' అని ముద్రించాలని నిబంధన విధించింది. నిబంధనలు పాటించని తయారీ యూనిట్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ చర్యలు తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: భారత్‌లోని ప్రముఖ కంపెనీల అసలు పేర్లు


