రోజువారీ జీవితంలో మనం ఎన్నో బ్రాండ్లను చూస్తుంటాం, ఆయా వస్తువులను ఉపయోగిస్తుంటాం. కానీ ఆ సంస్థల అసలు పేర్లు ఏమిటి? వాటి షార్ట్‌కట్ పేర్ల వెనుక ఉన్న పూర్వాపరాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే ఎంతో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ఒకప్పుడు చిన్న పరిశ్రమలుగా, ప్రాంతీయ వ్యాపారాలుగా ప్రారంభమై నేడు వేల కోట్ల టర్నోవర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో ప్రముఖ భారతీయ సంస్థల పేర్లు కాలక్రమేణా సంక్షిప్త రూపాలుగా స్థిరపడిపోయాయి. మన దేశంలోని ప్రముఖ టెక్నాలజీ, ఆటోమొబైల్, రిటైల్, ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థల అసలు పూర్తి పేర్లు, వాటి వెనుక ఉన్న విశేషాలను ఇక్కడ పరిశీలిద్దాం.
టెక్నాలజీ, స్టార్టప్స్, డిజిటల్ రంగాలు
OYO: అద్దె గదుల బుకింగ్ రంగాన్ని శాసించే ఓయో పూర్తి పేరు 'ఆన్ యువర్ ఓన్'. వినియోగదారులకు వారి సొంత ఇంటి వాతావరణాన్ని అందిస్తామనే ఉద్దేశంతో ఈ పేరును ఎంచుకున్నారు.
Paytm: మొబైల్ రీచార్జ్ యాప్‌గా ప్రారంభమై డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన పేటీఎమ్ అసలు పేరు 'పే త్రూ మొబైల్'.
HCL: భారత్‌లో ఐటీ రంగానికి పునాది వేసిన సంస్థల్లో ప్రధానమైన హెచ్‌సీఎల్ పూర్తి పేరు 'హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్'.
Wipro: నేడు ప్రముఖ ఐటీ దిగ్గజంగా ఉన్న విప్రో మొదట్లో వంటనూనెలు, వెజిటబుల్ ఆయిల్స్ తయారుచేసే సంస్థ. అందుకే దీనికి 'వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్' అనే పేరు వచ్చింది.
ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం
TVS: సంస్థ వ్యవస్థాపకుడు టీ.వీ. సుందరం అయ్యంగార్ జ్ఞాపకార్థం ఆయన ఊరు, సొంత పేరు కలిసొచ్చేలా ‘తిరుక్కురుంగుడి వెంగరం సుందరం’ అని నామకరణం చేశారు.
MRF: ప్రపంచస్థాయి టైర్ల తయారీ సంస్థ అయిన ఎంఆర్‌ఎఫ్ మద్రాస్ (చెన్నై) కేంద్రంగా ప్రారంభమైన 'మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ'.
BKT: టైర్ల రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బీకేటీ పూర్తి పేరు 'బాల్‌కృష్ణ టైర్స్'.
DLF: దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్ 'ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్' పేరుతో రూపుదిద్దుకుంది.
కన్స్యూమర్ గూడ్స్, ఎంటర్‌టైన్‌మెంట్
AMUL: గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా ప్రారంభమై శ్వేత విప్లవానికి మూలస్తంభంగా నిలిచిన అముల్ పూర్తి పేరు 'ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్'.
PVR: భారతదేశ మల్టీప్లెక్స్ అనుభవాన్ని మార్చివేసిన పీవీఆర్ అసలు పేరు 'ప్రియా విలేజ్ రోడ్‌షో'.
ITC: ప్రొడక్షన్ డైవర్సిఫికేషన్‌లో అగ్రగామిగా ఉన్న ఐటీసీ ఆరంభంలో పొగాకు ఉత్పత్తుల సంస్థగా 'ఇండియన్ టొబాకో కంపెనీ' పేరిట ఏర్పాటైంది.
BPL: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని గుర్తింపు పొందిన బీపీఎల్ పూర్తి పేరు 'బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీస్'.
ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట..


