విప్రో ఫలితాలు వీక్‌!  | Wipro Profit Down 4. 3percent, Revenue Up 1percent in Q1 Results | Sakshi
Sakshi News home page

విప్రో ఫలితాలు వీక్‌! 

Jul 17 2026 12:29 AM | Updated on Jul 17 2026 12:29 AM

Wipro Profit Down 4. 3percent, Revenue Up 1percent in Q1 Results

క్యూ1లో లాభం రూ.3,352 కోట్లు; ఫ్లాట్‌గా నమోదు 

ఆదాయం 10.6 శాతం వృద్ధి; రూ. 24,479 కోట్లు 

షేరుకి రూ. 2 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌ (2026–27, క్యూ1)లో కంపెనీ రూ.3,352 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.3,330 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు ఫ్లాట్‌గా నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం 10.6 శాతం జంప్‌ చేసి రూ.24,479 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.22,135 కోట్లుగా ఉంది. 

సీక్వెన్షియల్‌గా లాభం డౌన్‌... 
క్రితం ఏడాది చివరి క్వార్టర్‌ (2025–26, క్యూ4)లో నమోదైన రూ. 3,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1 లాభం 4.2 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో ఆదాయం రూ. 24,236 కోట్లుగా నమోదైంది. 

గైడెన్స్‌.. ప్చ్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ సేవల వ్యాపార ఆదాయ వృద్ధి అంచనాలు (గైడెన్స్‌) కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆదాయం 2.57 బిలియన్‌ డాలర్ల నుంచి 2.63 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. దీని ప్రకారం సీక్వెన్షియల్‌గా ఆదాయ గైడెన్స్‌ మైనస్‌ 1.5 శాతం నుంచి ప్లస్‌ 0.5 శాతంగా లెక్కతేలుతుంది. 

ఇతర ముఖ్యాంశాలివీ... 
→ ఐటీ సేవలకు సంబంధించిన ఆదాయం క్యూ1లో 2.61 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా 1.4 శాతం తగ్గగా, వార్షికంగా 1 శాతం పెరిగింది. 
→ ఐటీ సేవల నిర్వహణ మార్జిన్‌ 16 శాతంగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా 1.3 శాతం, వార్షికంగా 1.2 శాతం తగ్గింది. 
→ కంపెనీ వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ ఈ నెల 27 కాగా, ఆగస్ట్‌ 14 లోపు చెల్లిస్తుంది. 
→ ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,044కు చేరింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 888 మంది ఉద్యోగులు జతయ్యారు. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) 13.9 శాతంగా ఉంది. 
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర గురువారం 1.83 శాతం లాభపడి రూ.178 వద్ద ముగిసింది.

క్లయింట్లు టెక్నాలజీ ఆధునీకరణ స్థాయి నుంచి ఏఐ–ఆధారిత ఆపరేటింగ్‌ మోడల్స్‌ వైపు మళ్లుతున్నారు. దీనివల్ల నాణ్యత, ఉత్పాదకత మెరుగుపడుతుంది. దీనికి అనుగుణంగా విప్రో అందిస్తున్న కన్సల్టింగ్‌ ఆధారిత, ఏఐతో కూడిన విధానం వల్ల క్లయింట్లు తమ కీలక వ్యాపారంలో ఏఐని అమలు చేసేందుకు వీలవుతోంది. క్లయింట్లు తమ ఏఐ మార్పుల కోసం మాపై ఉంచుతున్న నమ్మకానికి, మా విస్తృత సామర్థ్యాలకు ఇది నిదర్శనం. 

– శ్రీని పల్లియా, విప్రో సీఈఓ, ఎండీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement