క్యూ1లో రూ. 3,273 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 3,273 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 2,973 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. మరోవైపు సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 18,721 కోట్ల నుంచి రూ. 20,724 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 6,359 కోట్ల నుంచి రూ. 7,435 కోట్లకు చేరింది.
తగ్గిన ఎన్‌పీఏలు..
జూన్ త్రైమాసికంలో మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 3.01 శాతం నుంచి 1.86 శాతానికి తగ్గాయి. అలాగే, నికర ఎన్‌పీఏలు సైతం 0.18 శాతం నుంచి 0.15 శాతానికి దిగి వచ్చాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు రూ. 387 కోట్ల నుంచి రూ. 376 కోట్లకు తగ్గాయి.
శుక్రవారం ఇండియన్ బ్యాంక్ షేరు దాదాపు 10% ఎగిసి సుమారు రూ. 871 వద్ద క్లోజయ్యింది.


