క్యూ4లో రూ.19,684 కోట్లు...
ఆదాయం రూ.1,43,876 కోట్లు; 2.4% తగ్గుదల...
తగ్గిన మొండి బకాయిలు...
షేరుకు రూ.17.35 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తికరమైన ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4)లో స్టాండెలోన్ (బ్యాంకు కార్యకలాపాలు మాత్రమే) ప్రాతిపదికన రూ.19,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.18,643 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది.
మొండి బకాయిలు కాస్త శాంతించినప్పటికీ... నికర వడ్డీ మార్జిన్, ట్రెజరీ ఆదాయం తగ్గడంతో లాభాల జోరుకు బ్రేక్ పడింది. కాగా, క్యూ4 మొత్తం ఆదాయం 2.5 శాతం దిగజారి రూ. 1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు చేరడం గమనార్హం. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 4.13 శాతం మాత్రమే పెరిగి రూ.44,380 కోట్లకు పరిమితమైంది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.14 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గింది.
ఎన్‌పీఏలు తగ్గాయ్...
ఎస్‌బీఐ మొండిబకాయిలు (ఎన్‌పీఏ) తగ్గుముఖం పట్టాయి. క్యూ4లో స్థూల ఎన్‌పీఏలు 1.49 శాతానికి చేరాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇవి 1.82 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.47 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్) రూ.3,964 కోట్ల నుంచి రూ.3,140 కోట్లకు దిగొచ్చింది. అయితే, క్యూ4లో కొత్తగా రూ.5,521 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.4,222 కోట్లు.
కన్సాలిడేటెడ్‌గా చూస్తే...
అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్‌గా ఎస్‌బీఐ 2025–26, క్యూ4 నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.19,649 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో నికర లాభం రూ.19,600 కోట్లుగా ఉంది. 2025–26 డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నమోదైన రూ.21,317 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం కూడా స్వల్ప పెరుగుదల (0.85%)తో రూ.1,79,562 కోట్ల నుంచి రూ.1,81,079 కోట్లకు చేరింది.
పూర్తి ఏడాదికి ఇలా...
2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 13 శాతం జంప్ చేసింది. రూ.80,032 కోట్లకు ఎగబాకింది. 2024–25లో నికర లాభం రూ.70,901 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,24,172 కోట్ల నుంచి రూ.5,51,647 కోట్లకు చేరింది. బ్యాంకు రుణాలు 16.87 శాతం వృద్ధి చెందగా... డిపాజిట్లు 11.03 శాతం పుంజుకున్నాయి.
డివిడెండ్ రికార్డ్ తేదీ మే 16...
గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు రూ.17.35 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి మే 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా, డివిడెండ్ చెల్లింపు జూన్ 4న జరగనున్నట్లు బ్యాంకు తెలిపింది.
షేరు 7 శాతం క్రాష్...
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు
బీఎస్‌ఈలో దాదాపు 6.6% క్షీణించి రూ.1,020 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 7.4 శాతం మేర పడింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే బ్యాంకు మార్కెట్ విలువ రూ.66,691 కోట్లు ఆవిరై... రూ.9,41,108 కోట్లకు దిగొచ్చింది.
కొత్తగా 6,000 కొలువులు..
ఎస్‌బీఐ కొత్తగా 6,000 మంది సిబ్బందిని నియమించుకోనుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం 2.45 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. టెక్నాలజీ నిపుణుల్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ లో హైరింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆంత్రోపిక్ మైథోస్ ఏఐ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులన్నీ ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తున్నాయని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సారథిగా కూడా ఉన్న శెట్టి పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీపై ఎస్‌బీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
సవాళ్లున్నా 13–15% రుణ వృద్ధి...
పశ్చిమాసియా యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాం. యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లు మరో ఆరు నెలల పాటు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మా మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయి. ఈ ఏడాది 3 శాతం ఎన్‌ఐఎం సాధించాలనేది టార్గెట్. కాగా, 2026–27లో ఆర్‌బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
– సీఎస్ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్


