జూన్‌లో రూ. 28,973 కోట్లు; 26.5 శాతం పెరుగుదల
నెలవారీ సిప్‌లు రూ. 31,781 కోట్లు
ఆర్నెల్లలో 1.81 లక్షల కోట్ల నిధులు
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో జూన్‌లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో మదుపరులు భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.22,908 కోట్లతో పోలిస్తే 26.5% అధికంగా రూ. 28,973 కోట్లు వచ్చాయి. నెలవారీ సిప్‌లు రూ. 30,954 కోట్ల నుంచి రూ.31,781 కోట్లకు ఎగిశాయి. దీనితో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ స్కీముల్లోకి రూ.1.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయింది.
2025 ప్రథమార్ధంలో నమోదైన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం జూన్‌లో ఫండ్స్ నుంచి ఉపసంహరణలు రూ.64,131 కోట్ల నుంచి రూ.52,949 కోట్లకు తగ్గాయి. పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం మే నెలలో రూ. 81.6 లక్షల కోట్లుగా ఉండగా జూన్ ఆఖరు నాటికి రూ. 82,.22 లక్షల కోట్లకు పెరిగింది.
మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశావహ అంచనాలు నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడంలాంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు పెరగడాన్ని చూస్తే, మే నెలలో అమ్మకాలను తాత్కాలిక ధోరణిగా, వ్యూహాత్మక లాభాల స్వీకరణగా భావించవచ్చని పేర్కొన్నారు.
యాంఫీ నివేదికలో మరిన్ని విశేషాలు
ఈక్విటీ కేటగిరీకి సంబంధించి మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.6,090 కోట్లు, స్మాల్ క్యాప్స్‌లోకి రూ.5,602 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్స్‌లోకి రూ.5,231 కోట్లు, లార్జ్ క్యాప్స్‌లోకి రూ.2,067 కోట్లు వచ్చాయి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) పెట్టుబడులను ఇన్వెస్టర్లు కొంత ఉపసంహరించుకున్నారు.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో నికరంగా రూ.3,443 కోట్లు ఇన్వె స్ట్ చేశారు. మేలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.725 కోట్లు వెనక్కి తీసుకున్నా రు. ఈ ఏడాది ప్రథమార్ధంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.37,319 కోట్లు వచ్చాయి.


