దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు గగనతల నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరిక జారీ చేసింది. విమానాల్లో కార్గో నిర్వహణ, ప్రమాదకర వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్‌ఓపీ) ఉల్లంఘనలపై ఈ హెచ్చరిక లేఖ పంపింది. ‘ఎయిర్‌క్రాఫ్ట్ (క్యారేజ్ ఆఫ్ డేంజరస్ గూడ్స్) రూల్స్, 2026’ నిబంధనలను విస్మరించడంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆడిట్‌లో బయటపడిన లోపాలు
ఈ ఏడాది జనవరిలో ఇండిగోకు చెందిన ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్‌పై కార్గో (సరుకులు) కింద చిందినట్లు (స్పిల్లేజ్) అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై డీజీసీఏ నిశితంగా పరిశీలించి ఇండిగో కార్గో విభాగంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో విమానయాన భద్రతా నిబంధనలు, ప్రమాదకర వస్తువుల హ్యాండ్లింగ్ ప్రొసీజర్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ఏటీఆర్) సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ హెచ్చరిక లేఖను ఎయిర్‌లైన్స్ జులై 8న అందుకుంది.
స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆలస్యంగా సమాచారం
ఈ భద్రతాపరమైన పరిణామానికి సంబంధించి సెబీ ఎల్‌ఓడీఆర్ రెగ్యులేషన్ 30 ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. ఈ జాప్యం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం సంస్థలోని అంతర్గత కమ్యూనికేషన్ లోపం వల్లే నియంత్రణ సంస్థల లేఖ వివరాలను స్టాక్ మార్కెట్లకు సకాలంలో వెల్లడించలేకపోయామని కంపెనీ సెక్రటరీ, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నీరజా శర్మ స్పష్టం చేశారు.
కార్యకలాపాల పరంగా ఎలాంటి ప్రభావం లేదు
ఈ హెచ్చరిక లేఖ వల్ల ఇండిగో విమాన సర్వీసులపై గానీ, సంస్థ ఆర్థిక పరిస్థితిపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని యాజమాన్యం వెల్లడించింది. డీజీసీఏ కేవలం హెచ్చరిక లేఖ మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతానికి ఎలాంటి జరిమానా , సర్వీసులపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది.
ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!


