ఇథనాల్ ఇంధనంపై ముదిరిన వివాదం! | keirjiwal-auto-giants-e20-fuel-mileage-compensation | Sakshi
Sakshi News home page

ఇథనాల్ ఇంధనంపై ముదిరిన వివాదం!

Jul 10 2026 3:17 PM | Updated on Jul 10 2026 3:20 PM

keirjiwal-auto-giants-e20-fuel-mileage-compensation

మారుతి, టయోటా, హీరో సహా 29 వాహన తయారీ సంస్థలకు లేఖలు

దేశవ్యాప్తంగా వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ వాడకంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఆటోమొబైల్‌ దిగ్గజాలకు ప్రశ్నలేవనెత్తారు. 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమనే అంశంపై దేశంలోని ప్రముఖ 29 ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ఆయన లేఖలు రాశారు. కంపెనీల అధికారిక మేనేజ్‌మెంట్‌ మాన్యువల్స్‌లో ఒకలా, ప్రభుత్వ వేదికలపై కంపెనీ ప్రతినిధులు మరోలా మాట్లాడుతున్నారని ఈ వైరుధ్యంపై వారంలోగా స్పష్టమైన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆప్ యూనిట్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను వెల్లడించారు.

కంపెనీల ద్వంద్వ వైఖరి

దేశంలోని ద్విచక్ర, నాలుగు చక్రాల వాహన తయారీదారులను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ రెండు రకాల లేఖలను పంపారు. మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ సంస్థలకు ప్రత్యేకంగా లేఖలు పంపారు. జులై 4న జరిగిన ప్రభుత్వ విలేకరుల సమావేశంలో ఈ మూడు కంపెనీలు మాట్లాడుతూ.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడినా ఎటువంటి నష్టం జరగదని, మైలేజీ కేవలం 3% నుంచి 5% మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నాయి. దేశంలోని మిగతా 26 ఆటోమొబైల్ కంపెనీలకు పంపిన లేఖలో.. పాత వాహనాల్లో ఈ20 వాడకంపై వారి అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని కోరారు.

ఆందోళనకర వైరుధ్యం ఇదే!

‘కంపెనీలు ప్రభుత్వ సమావేశంలో చెప్పే మాటలకు, వారు వినియోగదారులకు ఇచ్చే ఓనర్ మాన్యువల్స్‌కు పొంతన లేదు. 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో 10% కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకూడదని ఆ మాన్యువల్స్‌లో స్పష్టంగా రాసి ఉంది. మరి ప్రభుత్వ ప్రెస్‌మీట్‌లో అంతా సురక్షితమేనని ఎలా చెబుతున్నారు? ఇది వినియోగదారులను మోసం చేయడం కాదా?’ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

వాహనదారులకు నష్టపరిహారం ఇస్తారా?

కంపెనీల ముందు కేజ్రీవాల్ ప్రధానంగా రెండు డిమాండ్లను ఉంచారు. ఒకవేళ E20 పెట్రోల్ సురక్షితమేనని కంపెనీలు లిఖితపూర్వకంగా చెబితే కింద పేర్కొన్న అంశాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

1. మైలేజీ నష్టానికి పరిహారం: కంపెనీలు చెబుతున్న 4% నుంచి 5% కంటే ఎక్కువగా (ఉదాహరణకు 10% పైగా) మైలేజీ పడిపోతే సదరు వినియోగదారుడికి కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయా?

2. ఇంజన్ భాగాల వైఫల్యం: E20 ఇంధనం వాడకం వల్ల ఫ్యుయెల్‌ పంపులు, ఇంజన్ భాగాలు దెబ్బతింటే ఆ నష్టాన్ని భరించి ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీలు గ్యారెంటీ ఇస్తాయా?

గ్రౌండ్ రిపోర్ట్ కోసం పర్యటనలు

ప్రభుత్వం మొండిగా ప్రజలపై ఈ నిర్ణయాన్ని రుద్దుతోందని విమర్శించిన కేజ్రీవాల్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, సర్వీస్ సెంటర్లు, మెకానిక్ షాపులను సందర్శించి వాహనదారుల, నిపుణుల ప్రత్యక్ష అనుభవాలను సేకరించనున్నారు.

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement