ఈ85 పెట్రోల్‌ ఇంకా చౌక.. ఎంత తక్కువంటే.. | E85 fuel to cost around Rs 20 per litre less than E20 says Hardeep Puri | Sakshi
Sakshi News home page

ఈ85 పెట్రోల్‌ ఇంకా చౌక.. ఎంత తక్కువంటే..

Jul 10 2026 5:13 AM | Updated on Jul 10 2026 5:20 AM

E85 fuel to cost around Rs 20 per litre less than E20 says Hardeep Puri

దేశంలో ఇథనాల్‌ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.  E85 (85 శాతం ఇథనాల్‌, 15 శాతం పెట్రోల్‌) ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది. E85 ఫ్యూయల్‌ ధర E20 పెట్రోల్‌తో పోలిస్తే లీటరుకు సుమారు రూ.20 తక్కువ ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పేర్కొన్నారు.

అయితే ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చమురు సంస్థల 48 పెట్రోల్‌ బంకుల్లో E85 విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సీఎన్‌ఎన్‌-న్యూస్‌18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధార పడటాన్ని తగ్గించడం, దేశీయ ఇథనాల్‌ ఉత్పత్తికి ఊతమివ్వడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇథనాల్‌ మిశ్రమాలపై నడిచే వాహనాలకు వారంటీ, బీమా వంటి అంశాలపై ఉన్న సందేహాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.

E20పై అపోహలు అవసరం లేదు

E20 పెట్రోల్‌ వాడితే ఇంజిన్‌ దెబ్బతింటుందనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి  ఖండించారు. కోట్లాది ద్విచక్ర, లక్షలాది నాలుగు చక్రాల వాహనాలు ఇప్పటికే E20పై ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా నడుస్తున్నాయని, వాహన తయారీ సంస్థలు కూడా యాంత్రిక లోపాలపై విస్తృతంగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఇథనాల్‌ వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, తక్కువ కార్బన్‌ ఉద్గారాలు, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం వంటి ప్రయోజనాలు మరింత ముఖ్యమని వివరించారు.

E25 ఇంకా పరీక్షల దశలోనే..

ఇక E25 (25 శాతం ఇథనాల్‌ మిశ్రమం)ను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విస్తృత పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాత వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చించి మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి E25 వాణిజ్య విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యాలతో ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని హర్దీప్‌ సింగ్‌ పూరి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement